Indiramma House | మంచాల, జూన్ 20 : తాటి కమ్మలతో వేసుకున్న పూరి గుడిసెలో ఉంటున్నప్పటికీ ఇతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. అందుకు కారణం బిజెపి పార్టీలో కార్యకర్తగా ఉన్నాడని ఉద్దేశంతో. మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన కాసని యాదయ్య తన కుటుంబ పోషణ కోసం నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాదయ్య తనకున్న స్థలంలో 30 సంవత్సరాల క్రితం తాటి కమ్మలతో పూరి గుడిసె వేసుకున్నాడు. అందులోనే భార్యాపిల్లలతో జీవనం సాగిస్తున్నాడు.
యాదయ్యకు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కావడంతో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇల్లు మంజూరు అయితే కట్టుకుందామనుకున్నా యాదయ్య ఆశలు అడియాశలు అయ్యాయి. 30 సంవత్సరాల నుంచి యాదయ్య పూరి గుడిసెలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల యాదయ్య ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతనికి నిరాశ ఎదురైంది. ఇండ్లు ఉన్నవారికే కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు కానీ పూరి గుడిసెలో ఉన్న తనకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు లోయపల్లి గ్రామంలో గుంట భూమి కూడా లేదని ఏళ్ల తరబడి ఈ గుడిసెలోనే ఉంటున్నాను. కావాలనే కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తమకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు ఉన్నప్పటికీ తనకు మాత్రం ఇల్లు ఇవ్వలేదని వాపోయారు. కొందరి స్వార్ధ రాజకీయం కోసం అర్హులకు ఇండ్లు దరి చేరడం లేదు. మండల స్థాయిలో ఉన్న ఎంపీడీవో క్షేత్రస్థాయిలో పర్యటించి నిజమైన నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వవలసి ఉన్నప్పటికీ అవి ఎక్కడ కూడా అమలు కావడం లేదు. వర్షాకాలంలో ఇల్లు మొత్తం కురుస్తుందని అకాల వర్షాలు పడితే ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందన్నాడు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే తాను నిర్మించుకుంటానని చెప్పారు. మండల స్థాయి అధికారులు నిజమైన లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేయాలని యాదయ్య వేడుకుంటున్నాడు.
నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వరా..? : మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్
ఎన్నో ఏళ్ల నుంచి పూరి గుడిసెలోనే ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే కాంగ్రెస్ నాయకులు అర్హులను పక్కనపెట్టి ఇండ్లున్న వారికే ఇల్లు ఇస్తున్నారు. నిజమైన లబ్ధిదారుడు యాదయ్య పూరిగుడిసెలో ఉన్న అతనికి ఇల్లు ఇవ్వడంలో కాంగ్రెస్ నాయకులకు ఎందుకు బాధ. అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి అని మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్ డిమాండ్ చేశారు.