రంగారెడ్డి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ నిర్ణయాలతో రంగారెడ్డి జిల్లా స్వరూపం రోజురోజుకూ మారుతున్నది. జిల్లాలో జరుగుతున్న సమీకరణలతో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరుగనుంది. ఓ వైపు మున్సిపాలిటీల పెంపు కారణంగా ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఖ్య ఇప్పటికే గణనీయంగా తగ్గింది. ఔటర్‌కు లోపలున్న మున్సిపాలిటీలను కూడా గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతో జిల్లాలోని 9 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్‌లో కలువనున్నాయి. ఈ 9 మున్సిపాలిటీల్లో ప్రస్తుతమున్న 163 కౌన్సిలర్ పదవులు చేజారిపోనున్నాయి.
వచ్చే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకునే వారందరికీ ప్రభుత్వ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే 25 ఎంపీటీసీలు మున్సిపాలిటీలో కలిసాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్‌గా పోటీచేయాలనుకునేవారు నిరాశకు గురయ్యారు.
ఇప్పటికే ఔటర్ లోపలి మున్సిపాలిటీల్లో భాగంగా పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలో తారామతిపేట, బాచారం, కుత్బుల్లాపూర్ వంటి గ్రామాలను., శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామాన్ని విలీనం చేశారు. దీంతో జిల్లాలో గ్రామపంచాయతీలు, ఎంపీటీసీలు గణనీయంగా తగ్గాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీల్లో 9 మున్సిపాలిటీలు హైదరాబాద్ మహానగరంలో కలిసే అవకాశాలున్నాయి. దీంతో ఒక్కొక్క మున్సిపాలిటీలో ముగ్గురు నుంచి ఐదుగురికి మాత్రమే కార్పొరేటర్లుగా పోటీచేసే అవకాశాలున్నాయి.
జిల్లాలో 549 గ్రామపంచాయతీలుండేవి. ఇటీవల ఔటర్ లోపలి మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలతో పాటు చేవెళ్ల, మెయినాబాద్ మండలాలను మున్సిపాలిటీలుగా మార్చడం వలన 531 గ్రామపంచాయతీలు మాత్రమే అయ్యాయి. దీంతో 18 గ్రామపంచాయతీలు తగ్గగా 25 ఎంపీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది.
నగరపాలక సంస్థలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల విలీనాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇప్పటికే చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయవద్దంటూ ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వలన తమ గ్రామాలకు స్వయంప్రతిపత్తి ఉండదని, టాక్స్‌లు కూడా పెరిగే అవకాశాలున్నాయని, మున్సిపాలిటీల్లో చేర్చే విషయాన్ని మినహాయించాలంటూ కోరుతున్నారు. అలాగే, మున్సిపాలిటీలను నగరపాలక సంస్థలో విలీనం చేసే అంశంపై కూడా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలను విలీనం చేయడం వలన లాభాల కంటే నష్టాలే అధికంగా ఉంటాయని ప్రజలు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని మున్సిపాలిటీల ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఔటర్ లోపలి మున్సిపాలిటీలను విలీనం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. జిల్లాలో 15 మున్సిపాలిటీలుండగా.. 9 మున్సిపాలిటీలు ఔటర్ లోపలే ఉన్నాయి. ఇందులో పెద్దఅంబర్‌పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలున్నాయి. ఈ మున్సిపాలిటీలన్నీ ఔటర్ లోపలే ఉండటం వలన వీటిని గ్రేటర్ హైదరాబాద్‌లో కలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే రాజేంద్రనగర్‌లో ఉన్న 24 వార్డులను గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసి ఐదు డివిజన్లుగా విభజించారు. ఇదే ప్రాతిపదికన మిగిలిన మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే అవకాశాలుఉన్నాయ.
పెద్దఅంబర్‌పేట్ 24
తుర్కయాంజాల్ 24
ఆదిబట్ల 15
తుక్కుగూడ 15
శంషాబాద్ 25
బండ్లగూడ 22
మణికొండ 20
నార్సింగి 18