షాబాద్, అక్టోబర్ 19: తెలంగాణలో వ్యవసాయం చేస్తున్న రైతు ఏ కారణంతో మరణించినా అతడి కుటుంబం రోడ్డున పడకూడదు…ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకూడదు.. పిల్లలు చదువులు ఆగిపోకూడదు.. అనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నది. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో రైతులకు సంబంధించి బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. ఏ కారణంతోనైనా రైతు మృతిచెందినా వారం రోజుల వ్యవధిలోనే నామినీ ఖాతాల్లో రూ. 5లక్షల చొప్పున రైతుబీమా పరిహారం జమ చేస్తున్నారు. ఎలాంటి ఫైరవీ అవసరం లేకుండా నేరుగా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 3,810మంది రైతు కుటుంబాలకు పరిహారం అందింది. సర్కార్ భరోసాతో బాధిత రైతు కుటుంబాలు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 3,810 రైతు కుటుంబాలకు పరిహారం
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాలకు సంబంధించిన గ్రామాల్లో ఇప్పటివరకు 3,810 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5లక్షల చొప్పున మొత్తం రూ.190.50కోట్లు పరిహారం అందజేసింది. ప్రభుత్వం ఏటా ఆగస్టు నెలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతుల వివరాలను సేకరించి వారి తరఫున జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తోంది. రైతు బీమా పథకం వర్తించాలంటే రైతు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఆ మొత్తాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే బీమా సంస్థకు చెల్లిస్తోంది. ఒక్కో రైతుకు రూ. 3,487 ప్రీమియం చెల్లించి రైతుబీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. దీంతో ప్రమాదాల వల్లగానీ, ఇతర ఏ కారణాల వల్లగానీ రైతులు చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం అందిస్తున్నది.
రైతు కుటుంబాలకు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా అందిస్తున్న రూ. 5లక్షల సాయం అన్నదాతల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నది. వివిధ కారణాలతో చనిపోతున్న రైతుల కుటుంబాలను గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడంతో అనేక ఇబ్బందులు పడిన సంఘటనలున్నాయి. ఒక రైతుబిడ్డగా స్వరాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతు కూడా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ సరఫరా, ఎకరాకు రూ. 10వేలు పంట పెట్టుబడి సాయం, దిగుబడి వచ్చినంకా గిట్టుబాటు ధరకు పంట కొనుగోలుతో పాటు రైతు చనిపోతే బీమా సదుపాయం కూడా కల్పించింది. ఒక్క గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ. 5లక్షల బీమా పథకం వర్తింపజేస్తుంది. రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని బాధిత రైతు కుటుంబాలు చెబుతున్నారు.
రూ. 5లక్షల బీమా వచ్చింది
రైతు బీమా పథకం ద్వారా మా కుటుంబానికి రూ. 5లక్షల బీమా వచ్చింది. రైతుబీమా పథకం ద్వారా ప్రభుత్వం పేద రైతు కుటుంబాలను ఆదుకోవడం గొప్ప నిర్ణయం. గత నెలలో మా అమ్మ చనిపోయింది. నామినీగా ఉన్న నాకు రూ. 5లక్షలు బీమా అందించి ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకున్నది. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
జిల్లాలో 3,810మందికి బీమా సాయం
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలోని గ్రామాల్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు మొత్తం 3,810 మంది రైతులు వివిధ కారణలతో మృతిచెందారు. వారి నామినీల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చొప్పున రూ. 190.50కోట్ల బీమా సాయం ప్రభుత్వం జమ చేసింది. ప్రభుత్వమే ప్రతి ఏడాది రైతుల పేరిట ఎల్ఐసీకి ప్రీమియం డబ్బులు చెల్లించి రైతులకు బీమా సదుపాయం కల్పిస్తున్నది. అర్హులైన రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– గీతారెడ్డి, రంగారెడ్డిజిల్లా వ్యవసాయశాఖ అధికారి