సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్‌పై డ్రైవర్లు కన్నెర్ర చేస్తున్నారు. ఉపాధిని సృష్టించాల్సింది పోయి ఉన్న ఉపాధిని నాశనం చేసి.. జీవితాలను ఆగం చేస్తున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా క్యాబ్ డ్రైవర్లూ రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల వాహనాలు హైదరాబాద్‌లో రాకపోకలు సాగిస్తూ ఇక్కడి డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే కొందరు ఇతర రాష్ర్టాల వెండర్స్ వారి కంపెనీ కార్యకలాపాలకు తమ రాష్ర్టాలకు చెందిన వాహనాలను ఇక్కడికి నిబంధనలకు విరుద్ధంగా రప్పించి వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియతో ఇక్కడి డ్రైవర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన సుమారు 7 వేల వాహనాలు అక్రమంగా నగరంలో తిరుగుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మామూళ్ల మత్తులో చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్, ఆటో యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. నగరంలో సుమారు 80వేల మంది క్యాబ్ డ్రైవర్స్ ఉండగా.. వారంతా తమ ఉపాధిపై ఆందోళన చెందుతున్నారు.
ఖైరతాబాద్‌లోనే అధికం..
రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లోనే ఉంది. ఇక్కడ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్, ఇద్దరు ఆర్టీవోలు ఉంటారు. ఈ పరిధిలోనే అక్రమ వాహనాలు వందల్లో తిరుగుతున్నా అధికారులకు పట్టడంలేదని ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆరోపించారు. ఆర్టీవోలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏడు రోజుల కాల పరిమితితో బార్డర్ ట్యాక్స్ పేరిట ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలోకి ప్రవేశించి ఇక్కడే తిష్టవేస్తున్నాయి. మరోవైపు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత సేవల్లోనూ ఇతర రాష్ర్టాల వాహనాలే నడుస్తున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. వాహనానికి సంబంధించి పన్నులు, ఇన్సూరెన్స్‌లు చెల్లించి ప్రభుత్వానికి రాబడి వచ్చేలా తాము చేస్తుంటే ఇతర రాష్ట్రాల వాహనాలను తనిఖీలు చేయకుండా తమ ఉపాధిని దెబ్బకొడుతున్నారని వాపోతున్నారు. బీహెచ్ఈఎల్ , ఆరాంఘర్, సీబీఎస్ తదితర ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వ ఖజానాకు గండి..
రవాణా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడ నడవాలంటే అవి వారి సొంత రాష్ర్టాల్లో టీఆర్ రద్దు చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ పన్నును ఎగవేయడం కోసం వారు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ సమస్య మరింత జఠిలమై డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. అంతేకాకుండా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నది. కొందరు ముఠాలుగామారి కొంతమంది అధికారుల ప్రోత్సాహంతో యెల్లో ట్యాక్సీ ప్లేట్ అనుమతి లేకున్నా.. సొంత వాహనాలను ప్రయాణికుల రాకపోకలకు వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.
సుమారు 7వేల ఇతర రాష్ర్టాల వాహనాలు..
-షేక్ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్
రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 7వేల ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడ నడుస్తున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇప్పటి వరకు వాహనాలను ఎన్ని సీజ్ చేశారు? పబ్లిక్ డొమైన్లో కూడా ఎలాంటి వివరాలు పెట్టడం లేదు. అధికారులు మామూళ్ల మత్తులో నుంచి బయటకు రావాలి. ప్రభుత్వం స్పందించి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి.
మా ఉపాధిని కాపాడాలి
-సంతోష్ కుమార్, క్యాబ్ డ్రైవర్
మన రాష్ట్రానికి చెందిన వాహనాలు ఇతర రాష్ర్టాలకు వెళితే అక్కడి ట్రాన్స్పోర్ట్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ వేలాదిగా ఇతర రాష్ర్టాల వాహనాలు తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదు. అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న నిర్వాహకులను అడ్డుకుంటే.. ఏ ఆర్టీవోకు చెప్పుకుంటావో చెప్పుకో పో అంటున్నారు. వాళ్లంతా తమ మనుషులేనని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని మా డ్రైవర్ల ఉపాధిని కాపాడాలని కోరుకుంటున్నా.