సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో ఆదుకుంటూ రోగుల్లో భరోసా నింపుతున్నది. రోడ్డు ప్రమాదాలు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికీ రాష్ట్ర సర్కార్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. ముందుగానే ఎల్వోసీని అందజేస్తుండడంతో సంబంధిత దవాఖానల్లో ఉచితంగా వైద్యసేవలందుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకూ సీఎం సహాయనిధితో వైద్య సేవలందుతుండడంతో లబ్ధిదారులు చేతులెత్తి మొక్కుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సీఎం సహాయనిధి, ఎల్వోసీల ద్వారా 7500 మందికిగాను రూ.40 కోట్ల ఆర్థిక సాయం అందింది. సీఎం సహాయనిధితో పునర్జన్మ పొందిన లబ్ధిదారులు రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇబ్రహీంపట్నం, నవంబర్ 27 : వ్యాధిగ్రస్తులకు, ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తున్నది. గతంలో నిరుపేదలు వైద్యసేవలు చేయించుకునే స్థోమతలేక మృత్యువాతకు గురయ్యేవారు. కాని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిధి పథకంతో ఎంతోమందికి లబ్ధి చేకూరుతున్నది. జిల్లావ్యాప్తంగా ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ముందుగానే ఎల్వోసీ పత్రాల ద్వారా కూడా వైద్యసేవలు అందుకుంటున్నారు. తెల్లరేషన్‌కార్డు కలిగిన పేదవారు ఈ ఆర్థిక సాయాన్ని అందుకోవడానికి అర్హులవుతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రిపాలైనవారు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు ధైర్యంగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుని సహాయనిధి ద్వారా ఆర్థిక సాయాన్ని పొందుతున్నారు. ఈ నిధి కింద పారదర్శకంగా ఎమ్మెల్యేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 7500 మందికి ఆర్థిక సాయం
రంగారెడ్డిజిల్లాలో 2022 జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 7500 మంది వ్యాధిగ్రస్తులు, ప్రమాదాలకు గురైనవారు సీఎం సహాయనిధి, ఎల్వోసీల ద్వారా ఆర్థిక సాయం పొందినారు. వీరంతా ఆర్థిక స్థోమతలేని నిరుపేదలే. వీరిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1380 మంది, షాద్‌నగర్‌లో 1976, చేవెళ్లలో 1325, మహేశ్వరంలో 1568 మంది, అలాగే, కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జిల్లా పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాలవారు కూడా ఆర్థిక సాయం పొందినవారిలో ఉన్నారు.
జిల్లావ్యాప్తంగా రూ.40కోట్లకు పైగా అందిన ఆర్థిక సాయం
సీఎం సహాయనిధి, ఎల్వోసీ కింద జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రూ.7.68 కోట్లు, షాద్‌నగర్‌కు రూ.14.45, చేవెళ్లకు రూ.8.46, మహేశ్వరం నియోజకవర్గానికి రూ.10.55 కోట్లు ఆర్థిక సాయం అందింది.
ఆర్థిక స్థోమతలేని వారికి..
ఆర్థిక స్థోమతలేని పలు నిరుపేదలకు వైద్యం కోసం ఎల్వోసీ ద్వారా ముందుగానే ఈ పథకం కింద హామీ పత్రాన్ని అందజేస్తున్నారు. ఈ హామీ పత్రాన్ని రోగులు ముందుగానే ఆస్పత్రుల్లో ఇచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. వైద్య ఖర్చుల అనంతరం ఆస్పత్రుల యాజమానులు వైద్యం చేసి హామీపత్రం ద్వారా ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటున్నారు. ఈ ఎల్వోసీ ద్వారా ఎంతోమంది సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎల్వోసీ ద్వారా చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులవుతున్నారు.
ఎల్వోసీ ద్వారా నాకు పునర్జన్మ లభించింది
– శ్రీనివాస్, నోముల
ఎన్నో ఏండ్లుగా నడుమునొప్పి వ్యాధితో బాధపడుతూ.. మంచానికే పరిమితమయ్యాను. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని వ్యాధి నయం చేయించుకునేందుకు ఆర్థిక సాయం చేయించాలని కోరగా.. వెంటనే స్పందించి ఎమ్మెల్యే వైద్య ఖర్చుల కోసం రూ.4లక్షల ఎల్వోసీ పత్రాన్ని ఇచ్చారు. ఈ పత్రంద్వారా వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నడువగలుగుతున్నాను. సీఎ కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను.
గాయపడిన నాకు అండగా నిలిచిన సీఎం సహాయనిధి : సామయ్య, ఉప్పరిగూడ
నేను రోడ్డుపై ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు చేతిలో చిల్లిగవ్వకూడా లేదు. ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్న తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన ఆర్థిక సాయాన్ని ఆస్పత్రిలో చెల్లించాను. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నన్ను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను.
ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది
– పవన్, లోయపల్లి
మాది నిరుపేద కుటుంబం. ఆర్థిక స్థోమత సరిగ్గాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో నాకు కడుపులో కంతి అయ్యింది. దానిని తొలగించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవటంతో.. సీఎం సహాయనిధి పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది.
పేదలకు వరం సీఎం సహాయనిధి
– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటికే ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించాం. నియోజకవర్గంలో 1380 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద సుమారు రూ.7కోట్ల ఆర్థిక సాయం ఇచ్చాం. ఇకముందు కూడా నిరుపేదలైన వారికి ఈ ఆర్థిక సాయం అందజేస్తాం.