పరిగి, మే 6: నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అవసరమైతే పీడీ యాక్టు కూడా నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా పరిధిలో వానకాలంలో సుమారు లక్షా 90వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఈసారి పత్తి సాగు విస్తీర్ణాన్ని మరింత పెం చేందుకు అధికా రులు చర్యలు తీసుకుంటున్నారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు..
నకిలీ పత్తి విత్తనాల విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు వికారాబాద్ జిల్లాలోని ప్రతి మం డల, జిల్లాస్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పా టు చేయాలని అధికారులు నిర్ణయించారు. మండల స్థాయి కమిటీల్లో మండల వ్యవసాయాధికారి, ఎస్ఐ, జిల్లా స్థాయి కమిటీలో ఏడీఏ, సీఐ, ఇతర అధికారులు ఉంటారు. వారు తరచూ ఆయా ప్రాం తాల్లోని షాపులను తనిఖీలు చేపట్టడంతోపాటు గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ తరచూ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నాణ్యత లేని విత్తనాల విక్రేతల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి నకిలీ విత్తనాలు మన జిల్లాలోకి రాకుండా పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే జిల్లా సరిహద్దులోని కొత్లాపూర్, రావులపల్లి గ్రామాల్లో అధికారులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు..
నాణ్యతలేని పత్తి విత్తనాలను విక్రయించే వారిపై అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేయాలని ప్రభు త్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామా ల్లో లైసెన్స్ లేకుండా విత్తనాలను విక్రయించే వారి వివరాలను ప్రజలు సంబంధిత వ్యవసాయాధికారి లేదా పోలీసులకు లేదా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్‌కు తెలపాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతోపాటు బిల్లులు లేకుండా రైతులు విత్తనాలను కొనుగోలు చేస్తే సంబంధిత పంట వివరాలు రైతుబంధు పోర్టల్‌లో నమోదు కావని.. తద్వారా ఏ విధమైన నష్టపరిహారానికి సదరు రైతులు అర్హులు కారని సూచిస్తున్నారు. విత్తనాలపై అనుమానం ఉంటే దగ్గరలోని పోలీసుస్టేషన్లో రైతులు ఫిర్యాదు చేయాలని పేర్కొంటున్నారు. జిల్లా పరిధిలో గతేడాది నకిలీ విత్తనాల విక్రయాలకు సంబంధించి 8 కేసులు నమోదయ్యాయి. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్, యాలాల, బషీరాబాద్ మండలాల్లోనే అత్యధికంగా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో నమోదైన కేసులు కూ డా ఈ ఐదు మండలాల్లోనే నమోదయ్యాయి. అం దువల్ల అధికారులు ఈ ఐదు మండలాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని నిర్ణయించారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. జిల్లాలో గతేడాది నకిలీ విత్తనాలకు సంబంధించి 8 కేసులు నమోదయ్యాయి. నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్న ఐదు మండలాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాం. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఎస్ఐ, జిల్లా స్థాయిలో ఏడీఏ, సీఐలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశాం. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు జరిగితే ప్రజలు వెంటనే సమాచారం అందించాలి. -గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి