రంగారెడ్డి, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన సన్న వడ్లను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించివారికి ప్రతి క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటివరకు డబ్బులివ్వలేదు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి బోనస్ డబ్బులు ఉపయోగపడతాయని అన్నదాతలు ఆశపడుతున్నారు. కానీ ప్రభుత్వం బోనస్ ఇవ్వకుండా కేవలం ధాన్యానికి సంబంధించిన డబ్బులను మాత్రమే ఇచ్చింది. గత సీజన్లో కూడా బోనస్ డబ్బులివ్వలేదు. ఈసారి కూడా బోనస్ డబ్బులిస్తారా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. వెంటనే సర్కారు స్పందించాలని కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో సుమారు 40,000 మంది రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే అధికారులు 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అలాగే 90% మంది రైతులకు ధాన్యం డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశారు. బోనస్ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. గత సంవత్సరం సర్కారు బోనస్‌ను ఎగ్గొట్టింది.
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనస్ ఇస్తారా లేదా అనేది తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. డబ్బుల కోసం ప్రతిరోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి బోనస్ డబ్బులు రావడం లేదని అధికారులు దాటవేస్తున్నారు. ఈ విషయమై సివిల్ సైప్లె డీఎం గోపీకృష్ణను సంప్రదించగా.. జిల్లాలోని రైతులందరికీ త్వరలోనే ప్రభుత్వం బోనస్ డబ్బులను చెల్లిస్తుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సొమ్మును 90% పైగా రైతులకు వారి ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.