ధారూరు,జూలై 12; రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, రూ.3వేల కోట్లతో వికారాబాద్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ధారూరు మండల పరిధిలోని కెరెళ్లి, ధారూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో లయన్స్‌క్లబ్ వారి ఆధ్వర్యంలో చేపట్టనున్న మరుగుదోడ్ల నిర్మాణం, అల్లీపూర్, కుక్కింద-గడ్డమీది గంగారం గ్రామాల మధ్య బీటీరోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే ధారూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ అనంతగిరి అభివృద్ధికి రూ.500 కోట్లతో టూరిజం, ఉపాధి అవకాశాలు కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధికి రూ.110 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో కోట్‌పల్లి ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధితో చేయడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెక్టుతో పాటు జుంటుపల్లి, సర్పన్‌పల్లి, నందిగామ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఆరోగ్య శ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.15వేలు ఇస్తామని గతంలో ప్రకటించిన విధంగా త్వరలోనే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 10 ఎకరాలలోపు ఉన్న రైతులకు సాగుభూమికి ఇవ్వాలని రైతులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. దీనిపై సబ్ కమిటీ వేశామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికీ 3500 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడుతలో ఇవ్వనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ధారూరు తహసీల్దార్ షాజీదాబేగం, డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో నర్సింహులు, ఎంఈవో బాబుసింగ్, సత్యనారాయణరెడ్డి, నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, రాములు, హన్మంత్‌రెడ్డి, బాబాఖాన్, అనిల్‌కుమార్, యూనుస్, రాంరెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ ప్రతి నిధులు, విద్యార్థులు ఉన్నారు.