రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ) : అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మూడుసార్లు గడువు పొడిగించినా జిల్లాలోని దరఖాస్తుదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. కాగా ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2,56,000 దరఖాస్తులు రాగా.. వాటిలో 1,78,600 అప్లికేషన్లు మాత్రమే రెగ్యులరైజేషన్‌కు అర్హత పొందగా.. ప్రభుత్వానికి రూ.255 కోట్ల రాబడి సమకూరింది. మిగిలిన 1,20,000 దరఖాస్తులను త్వరగా క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేసినా వారు ముందుకు రావడం లేదు. అయితే, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి 77,332 అప్లికేషన్లు రాగా వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా రూ.600 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటివరకు రూ.255 కోట్ల ఆదాయమే సమకూరింది. ఖాళీ ప్లాట్లు, అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020లో గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు రూ.10,000, ఖాళీ ప్లాట్లకు రూ. 1000గా నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని మూడు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీల నుంచి దాదాపుగా 2,56,000 దరఖాస్తులొచ్చాయి. అలాగే, జిల్లాలోని వివిధ మండలాల నుంచి కూడా 45,000 పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే, గత ప్రభుత్వంలో పలు కారణాలతో క్రమబద్ధీకరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఫిబ్రవరిలో వన్‌టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి 25 శాతం రాయితీ ప్రకటించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం వాటి పరిశీలన కోసం రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. తొలి గడువు మార్చి 31తో ముగిసినా.. ఆశించిన స్థాయిలో ప్లాట్ల క్రమబద్ధీకరణ కు యజమానులు ముందుకు రాకపోవడంతో ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచింది. ఆ గడువు కూడా ముగిసిపోవడంతో మూడోసారి ఈనెల 31 వరకు పొడిగిస్తూ తాజాగా సర్కార్ ఉత్తర్వులను జారీచేసింది.
ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు పరిశీలించిన తర్వాతే కమిషనర్ లాగిన్‌కు పంపిస్తారు. ఆ తర్వాత వాటిని కమిషనర్ ఫైనల్ చేస్తారు. కానీ, జిల్లాలో ఓ వైపు టీపీవోల కొరత, మరోవైపు భూభారతి వంటి పథకం ద్వారా రెవెన్యూ సిబ్బందికి అదనపు పనులను అప్పగించడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కూడా అందుబాటులో ఉండడంలేదు. మరోవైపు ఇరిగేషన్ అధికారులు కూడా హైడ్రా ఆదేశాలతో చెరువులు, కుంటలపైనే దృష్టి సారించారు. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇరిగేషన్ శాఖల అధికారుల చుట్టూ తిరగలేక ప్లాట్ల యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ కారణాలతోనే ప్లాట్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదన్న ఆరోపణలున్నాయి.
హైదరాబాద్ శివారుల్లోని రంగారెడ్డి జిల్లాలో గతంలో పెద్ద ఎత్తున పంచాయతీ లేఅవుట్లతో ప్లాట్లుచేసి విక్రయించారు. ఆయా వెం చర్లలో ప్లాట్లు కొన్న వారికి ఎల్ఆర్ఎస్ లేదు. శివారు ల్లో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల యజమానులూ క్రమబద్ధీకరణకు ముందుకు రావడంలేదు. ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని ప్రభుత్వం నోటీసులిచ్చినా స్పందించడంలేదు. దీంతో జిల్లా నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 50శాతం కూడా వచ్చే అవకాశం కనిపించడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇస్తుం దా..? లేక క్రమబద్ధీకరించుకోని ప్లాట్ల యజమానులపై చర్యలు తీసుకుంటుందా..? అనేది త్వరలోనే తెలియనున్నది.