ఔటర్ చుట్టూ రైల్వే లైన్
ప్రధాన రహదారి, సర్వీస్‌రోడ్డు మధ్య రైలుమార్గం
ఎంఎంటీఎస్తరహాలో సేవలు
ప్రభుత్వం ద్వారా రైల్వేశాఖను కోరనున్న హెచ్ఎండీఏ
నగర స్టేషన్లపై తగ్గనున్న ట్రాఫిక్ ఒత్తిడి
భవిష్యత్ రాకపోకలు సులువు..వేగంగా శివార్ల అభివృద్ధి
సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): నగరానికి తలమానికంగా, సులువు ప్రయాణానికి చిరునామా అయిన ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ రైల్వేలైన్ రానుంది. ఈ ప్రతిపాదనను మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నది. రెండు వరుసల్లో నిర్మించదలచిన ఈ రైల్వేలైన్ కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశారు. ఔటర్ లోపల మెయిన్ రోడ్డు-సర్వీసురోడ్డు మధ్య 25 మీటర్ల వెడల్పుతో భూమి సిద్ధంగా ఉంది. ఔటర్ చుట్టూ ఉన్న రైల్వేస్టేషన్లు, 19 ఇంటర్‌ఛేంజ్‌లను కలుపుతూ నూతన రైల్వేలైన్‌ను నిర్మించనున్నారు. కొత్త లైన్ కల సాకారమైతే శివారు ప్రాంతాలకు రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతోపాటు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు నిత్యం శివార్లలో గంటలతరబడి నిలుపుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీని నివారణకు ఔటర్ సమీపంలో శాటిలైట్ రైల్వే టెర్మినళ్లను నిర్మించనున్నారు. ఇప్పటికే చర్లపల్లి వద్ద పనులు పురోగతిలో ఉండగా, మరోటి ఐటీ కారిడార్ సమీపంలో కొల్లూరు-ఈదులనాగులపల్లి వద్ద ఉన్న రైల్వేస్టేషన్‌ను శాటిలైట్ టర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖను ప్రభుత్వం కోరింది.
భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను తీర్చేలా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రైల్వే లైన్ వేయాలన్న ప్రతిపాదనను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మరింత వేగంగా ముందుకు కదుపుతున్నది. రైల్వేలైన్‌కు అవసరమైన భూములను ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో ఇక రైల్వేలైన్ వేయాలని ప్రభుత్వం ద్వారా రైల్వేశాఖను కోరనున్నది. ఔటర్ చుట్టూ ఉన్న రైల్వేస్టేషన్లు, 19 ఇంటర్‌ఛేంజ్‌లను కలుపుతూ సాగే ఈ రైల్వేరింగులైను.. మరో 4-5 ఏం డ్లలో సాధ్యమయ్యే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆ స్టేషన్లపై ఒత్తిడి తగ్గేలా
నగరంలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లపై ఇప్పటికే విపరీతమైన ఒత్తిడి ఉంది. పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా రైల్వే స్టేషన్ ప్రాంగణాలను విస్తరిస్తున్నా, భవిష్యత్ అవసరాలకు సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు శివారు ప్రాంతాల్లోనే రైల్వే టర్మినల్స్‌ను ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లపై ఒత్తి డి తగ్గుతుంది. తద్వారా రైళ్ల రాకపోకలు చాలా వేగంగా సాగేందుకు అవకాశం ఉంటుందని అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ నిపుణులు హెచ్ఎండీఏకు సూచించారు. ఇప్పటికే రెండు చోట్ల ఔటర్ రింగు రోడ్డు సమీపంలో శాటిలైట్ రైల్వే టర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలు చేయగా, అందులో చర్లపల్లి వద్ద పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. మరో టర్మినల్‌ను ఐటీ కారిడార్‌కు సమీపంలో కొల్లూరు- ఈదుల నాగులపల్లి వద్ద ఉన్న రైల్వే స్టేషన్‌ను శాటిలైట్ టర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. వీటికి తోడు ఓఆర్ఆర్ చుట్టూ పట్టణ ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొ ని ఎంఎంటీఎస్ తరహాలో రైల్వే సౌకర్యాన్ని కల్పించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి కేంద్ర రైల్వేశాఖతో సంప్రదించాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడితే మరో 4-5 ఏండ్లలో గ్రేటర్ చుట్టూ రైల్వే రింగ్ లైన్ నిర్మాణం సాధ్యమయ్యే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
శివారులో మరింత అభివృద్ధి
ఇప్పటికే ఓఆర్ఆర్ చుట్టూ విస్తరిస్తున్న నగర శివారు..రైల్వే రింగులైను సాకారమైతే అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. ఐటీ కారిడార్ వైపు ఉన్న తెల్లాపూర్ నుం చి కొల్లూరు, శంకర్పల్లి, మోకిల, కొండకల్, భానూరు వంటి ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు, పరిశ్రమలు భారీ సంఖ్యలో వెలుస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం వైపు ఉన్న ఆదిభట్ల, మహేశ్వరం చుట్టు పక్కల ప్రాంతా ల్లో ఐటీ, ఏరోస్పేస్తో పాటు ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, ఈ-సిటీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్ వంటివి ఏర్పాటవుతున్నాయి. వీటికి తోడు వరంగల్-హైదరాబాద్ మార్గంలో యాదాద్రి వరకు నగరం విస్తరించేందుకు అవకాశం ఉంది. ఇలా నలువైపులా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో రైల్వే లైనును గ్రేటర్ చుట్టూ ఏర్పాటు చేయడం వల్ల సులభంగా, వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.