శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Aug 06, 2020 , 01:24:42

జీరో ఇయర్‌కే జై కొట్టిన మెజార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు

జీరో ఇయర్‌కే జై కొట్టిన మెజార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు

కొవిడ్‌-19 వ్యాప్తి దృష్ట్యా పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బడులు తెరువాలా..? వద్దా..? ఒకవేళ తెరిస్తే ఎలాంటి ఆంక్షలు, సౌకర్యాలు ఉండాలనే అంశాలపై రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. చాలామంది జీరో ఇయర్‌  వైపే మొగ్గుచూపారు. మరికొందరు భిన్న  అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  వీటన్నింటిపై  జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి  ఓ నివేదికను తయారుచేసి రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు పంపించారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : కొవిడ్‌-19 నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటికే 2019-2020 విద్యా సంవత్సరం ముగింపునకు నెలరోజుల ముందే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే.. ఇప్పటికే అందరిని పై తరగతులకు ప్రమోట్‌ చేశారు. 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో బడులు తెరువాలా..? వద్దా..? ఈ కొవిడ్‌ పరిస్థితుల్లో ఎప్పుడు పాఠశాలలను తెరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు.? పాఠశాల తెరిస్తే ఎటువంటి సౌకర్యాలు పాఠశాలలో ఉండాలని మీరు అనుకుంటున్నారు.? పాఠశాల ప్రారంభిస్తే ఎలా నడుపాలి అని మీరు అనుకుంటున్నారు.? అనే అంశాలపై రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం జీరో ఇయర్‌గా ప్రకటించాలని కొందరు, మరికొందరు నెలల వారీగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌లలో పాఠశాలలు ప్రారంభించాలని రకారకాల అభిప్రాయాలను ఆన్‌లైన్‌ సర్వేలో పొందుపర్చారు. అలాగే రోజుకు ఎన్ని తరగతులు నిర్వహించాలి.. గదికి ఎంత మంది విద్యార్థులను అనుమతించాలి.. ఒకే తరగతికి ఉదయం కొందరు, మధ్యాహ్నం కొందరు.. ఒక్కో తరగతికి రోజు విడిచి రోజు నిర్వహించాలి.. షిప్ట్‌ విధానంలో నడుపడం వల్ల విద్యార్థులు గుంపుగా లేకుండా చూడాలి. ప్రతి విద్యార్థికి శానిటైజర్లు, మాస్కులు యాజమాన్యం, ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలి. భౌతిక దూరం తప్పకుండా పాటించాలి.. ఇలా అనేక అంశాలపై దాదాపుగా 60 కాంబినేషన్లను వెల్లడించారు. ఈ నివేదికలను జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి మంగళవారం రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు పంపించారు. 

   రంగారెడ్డి జిల్లాలో 1231 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు 3721 మంది ఈ సర్వేలో పాల్గొనగా.. 12,698 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 24,276 మంది చొప్పున మొత్తం 27,997 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను తెలిపారు. హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్‌ సౌకర్యం కల్పించాలని 357 ప్రభుత్వ, 927 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన తల్లిదండ్రులు కోరుకున్నారు. ఎక్కువగా మరుగుదొడ్లు ఏర్పాట చేయాలని 47 ప్రభుత్వ, 183 ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రతి విద్యార్థికి మాస్కులు ఏర్పాటు చేయాలని 305 ప్రభుత్వ, 545 ప్రైవేట్‌ పాఠశాలలు, మాస్కులు, హ్యాండ్‌ వాష్‌ అండ్‌ శానిటైజర్‌ అన్నీ కలిపి ఏర్పాటు చేయాలని 84, ప్రభుత్వ,141 ప్రైవేట్‌ పాఠశాలలు, స్కూల్‌ రెగ్యులర్‌ శానిటైజ్‌ చేయాలని 431 ప్రభుత్వ, 1,904 ప్రైవేట్‌ పాఠశాలలు, రెగ్యులర్‌ శానిటైజ్‌ అండ్‌ హ్యాండ్‌ వాష్‌ అండ్‌ శానిటైజ్‌ ఏర్పాటు చేయాలని 12 ప్రభుత్వ, 260 ప్రైవేట్‌ పాఠశాలలు, రెగ్యులర్‌ శానిటైజేషన్‌ అండ్‌ హ్యాండ్‌ వాష్‌ అండ్‌ శానిటైజర్‌ అండ్‌ మోర్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలని 4 ప్రభుత్వ, 280 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన తల్లిదండ్రులు తమ ఒపీనియన్‌లో ప్రకటించారు. అలాగే విద్యార్థులు పాఠశాలలకు హాజరైతే దూరం..దూరంగా.. ఉండే విధంగా ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయాలని 76 ప్రభుత్వ, 332 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన తల్లిదండ్రులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. 357 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన తల్లిదండ్రులు 3,721 మంది, 927 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 24,276 మంది హ్యాండ్‌ వాష్‌ అండ్‌ శానిటైజర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. 431 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన తల్లిదండ్రులు 3,721 మంది, 1,904 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 24,276 మంది రెగ్యులర్‌ శానిటైజైషన్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 76 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన తల్లిదండ్రులు 3,721 మంది, 332 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 24,276 మంది విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఫర్నిచర్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. మొత్తం మీద ప్రభుత్వ విద్యార్థుల తల్లిదండ్రులు హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్‌, మాస్కులు, ఫర్నిచర్‌, సురక్షితమైన మంచినీరు ఏర్పాటు చేసేలా తమ అభిప్రియాలను పేర్కొన్నారు. ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులు మాస్కులు, హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్‌, రెగ్యులర్‌ స్కూల్‌ శానిటైజ్‌సే విధంగా నిబంధనలు రూపొందించాలని ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.  

ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం..

   రంగారెడ్డి జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, సంఘాల నాయకులతో ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించాం. బడులు తెరువాలా..? వద్దా..? అనే అంశంపై పాఠశాలలు ఎప్పుడు తెరువాలి.. సర్వేలో పాల్గొన్నవారు 27,997 మంది కాగా.. ప్రభుత్వ పాఠశాలల నుంచి 3721(తల్లిదండ్రులు-13.5%), ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 24,276 (తల్లిదండ్రులు-86.5%) మంది పాల్గొన్నారు. జీరో ఇయర్‌ ప్రకటించాలని 13,434 (48%) కోరుకున్నారు. నవంబర్‌లో నిర్వహించాలని 4,614 (16.5%), ఆగస్టు 3,342(11.5%), సెప్టెంబర్‌ 3,793 (13.5%), అక్టోబర్‌లో నిర్వహించాలని 2,814(10.5%) మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సర్వే రిపోర్టును రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు పంపించాం.  -విజయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా విద్యాధికారి