ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 02, 2020 , 00:51:43

మహేశ్వరంలో మోడల్‌ రైతు వేదిక

మహేశ్వరంలో మోడల్‌ రైతు వేదిక

  • న్యూజీలాండ్‌ టెక్నాలజీతో నిర్మాణం 
  • రాష్ట్రంలో నూతన హంగులతో ఏర్పడుతున్న తొలి వేదిక 
  • 50 ఏండ్లపాటు చెక్కు చెదరదు 
  • పనులను పర్యవేక్షిస్తున్న 
  • రంగారెడ్డి కలెక్టర్‌  అమయ్‌కుమార్‌

మహేశ్వరం/ బడంగ్‌పేట: రాష్ట్రంలో నూతన హంగులతో న్యూజీలాండ్‌ టెక్నాలజీతో మొదటి రైతు వేదికను ప్రభుత్వం మహేశ్వరంలో నిర్మిస్తున్నది.  అర ఎకరం విస్తీర్ణంలో రూ.22 లక్షలతో రైతు వేదిక పనులు చేపట్టింది. తెలంగాణలో   రెండు చోట్ల మాత్రమే మోడల్‌ రైతు వేదికలు ఏర్పాటుచేస్తున్నారు. కామారెడ్డి, మహేశ్వరంలో ఈ వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో మహేశ్వరంలో రైతు వేదికను పూర్తిచేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఇతర విభాగాల అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. మహేశ్వరంలో నిర్మిస్తున్న రైతు వేదిక 50 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం, జింక్‌తో తయారు చేసిన వాటితో ఈ వేదికను నిర్మిస్తున్నారు. అందుకే తుప్పు పట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉండవని కాంట్రాక్టర్‌ పేర్కొంటున్నారు. నిర్మాణ పనుల్లో  ఒక్క ఇటుక లేకుండా కోల్డ్‌ ఫార్ముడ్‌ స్టీల్‌తో ఈ పనులను చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నూతన హంగులతో రాష్ట్రంలోనే మొదటి రైతు వేదికను ఒక రోల్‌ మోడల్‌ పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. న్యూజీలాండ్‌ కంపెనీకి చెందిన నిపుణులను పర్యవేక్షణలో దీని పనులు జరుగుతున్నాయి. పది రోజుల్లో మోడల్‌ రైతు వేదిక పనులను పూర్తి చేయనున్నారు. ప్రసుత్తం పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేదికల ద్వారా మేలు జరుగుతుందని రైతాంగం విశ్వసిస్తున్నారు.

సర్కారు మంచి పనులు చేస్తున్నది


ఏ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదు. రైతుల కోసం కేసీఆర్‌ చాలా మంచి పనులు చేస్తున్నారు. రైతు బంధు వస్తున్నది. రైతులకు సంఘం ఏర్పాటు చేసిండ్రు. లాభాలు వచ్చే పంటలు వేయమంటున్నరు. మార్కెట్‌కు పోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి పంటలు వేయాలో ముందే అవగాహన కల్పిస్తున్నరు. నష్టపోయే పంటలు వేయవద్దంటున్నరు. బాధలు చర్చించడానికి రైతు వేదికలు నిర్మిస్తున్నరు. రైతు చనిపోతే బీమా వస్తున్నది. సర్కార్‌ మంచి పనులు చేస్తున్నది.

- దయాల బాలరాజు,  రైతు 

మహేశ్వరంలో ఈ వేదిక నిర్మించడం అదృష్టం


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక రోల్‌ మోడల్‌ రైతు వేదికను తన నియోజక వర్గంలో మొదటిసారి నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నాం. 50 ఏండ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అనడానికి ఈ వేదిక నిదర్శనం. రైతుల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. వారికోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి ఎంతో మేలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. రైతు సమస్యలను ఈ వేదికల ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తున్నారు. త్వరలోనే ఈ వేదికను ప్రారంభిస్తాం. ప్రస్తుతం పనులు చివరి దశకు వచ్చాయి. రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో, పండించిన పంట గురించి చర్చించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది.

- మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి