వికారాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల యంత్రాంగం వినియోగించనున్నది. అధికారులు ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రానికీ కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లతోపాటు వీవీప్యాట్లను ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్‌రూంలకు తరలించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బరిలో 43 మంది అభ్యర్థులు ఉండడంతో అదనపు బ్యాలెట్ యూనిట్ల అవసరం ఏర్పడడంతో ఎన్నికల సంఘం జిల్లాకు సమకూర్చింది. ఈసీఐఎల్ కంపెనీ నుంచి జిల్లాకు మంగళవారం 2000 బ్యాలెట్ యూనిట్లు చేరుకోగా వాటిని జిల్లా కేంద్రంలోని ఈవీఎంల స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు.
బుధవారం ప్రారంభించిన ఎఫ్ఎల్సీ(ఫస్ట్ లెవల్ చెక్) ప్రక్రియను గురువారం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. అనంతరం బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టి 5వ తేదీలోగా ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్‌రూంలకు వాటిని తరలించనున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మూడు బ్యాలెట్ యూనిట్లు, కొడంగల్ సెగ్మెంట్లోని పోలింగ్ కేంద్రాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు.
ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రానికీ ఒక్కో బ్యాలెట్ యూనిట్లను తరలించగా, త్వరలో మరో రెండు బ్యాలెట్ యూనిట్లనూ చేరవేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ అదనంగా 25 శాతం మేర బ్యాలెట్ యూనిట్లను అందుబాటులో ఉంచనున్నారు. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలందరూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రానికీ కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లతోపాటు ఓ వీవీ ప్యాట్తోపాటు కూడిన ఈవీఎంలను తరలించారు. వికారాబాద్ సెగ్మెంట్‌కు సంబంధించిన ఈవీఎంలను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేరీనాట్ స్కూల్లో.. పరిగి సెగ్మెంట్‌కు పరిగిలోని మినీ స్టేడియంలో.. తాండూరు సెగ్మెంట్‌కు సెయింట్ మార్క్స్ స్కూల్లో..కొడంగల్ సెగ్మెంట్‌కు కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంల్లో భద్రపర్చారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికీ 25శాతం అదనంగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీప్యాట్లను తరలించారు.
పరిగి నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలుండగా 381-కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, 427- వీవీప్యాట్లను తరలించారు. వికారాబాద్ సెగ్మెంట్లో 284 పోలింగ్ కేంద్రాలుండగా 355-కంట్రోల్, యూనిట్లు, 397-వీవీప్యాట్లు.. తాండూరు నియోజకవర్గంలో 277 పోలింగ్ కేంద్రాలుండగా 346-బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 397-వీవీప్యాట్లను.. కొడంగల్ నియోజకవర్గంలో 282 పోలింగ్ కేంద్రాలుండగా 352-కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, 394-వీవీప్యాట్లను కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 5028 మంది పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణనిచ్చారు. వీరిలో 1257 మంది పీవోలు, 1257 మంది ఏపీవోలు, 2514 మంది ఓపీవోలున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నాం. చేవెళ్ల బరిలో 43 మంది అభ్యర్థులున్న దృష్ట్యా ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాకు అదనంగా అవసరమయ్యే బ్యాలెట్ యూనిట్ల ఎఫ్ఎల్సీ ప్రక్రియ, ర్యాండమైజేషన్ను పూర్తి చేసి ఈ నెల ఐదులోగా నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్‌రూంలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టర్