కులకచర్ల, జూన్ 7 : పిడుగు పాటుకు వేర్వేరు ఘటనల్లో 17 జీవాలు మృతి చెందాయి. చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన లింగన్నపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగుపడి ఐదు జీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన అలకుంట లాలు అనే రైతు ఐదు పాడి గేదెలను పొలం దగ్గర చెట్టుకు కట్టి వేశాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి ఒక్కసారిగా పిడుగు పడటంతో పాడిగేదెలు మృతి చెందాయి. పాడి గేదెలు మృతి చెందడంతో జీవనోపాధి కోల్పోయానని ఆదుకోవాలని గ్రామస్తులు, రైతు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. అలాగే పిడుగు పాటుకు పాడి ఆవు మృతి చెందిన ఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో జరిగింది. చెన్నయ్య అనే రైతుకు చెందిన ఆవు పిడుగు పాటుకు మృతి చెందింది. సుమారుగా 80వేలు విలువ చేసే ఆవు మృతి చెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు.
ఆమనగల్లు మండలంలో మూడు ఆవులు..
ఆమనగల్లు : పిడుగు పాటుకు మూడు ఆవులు మృతి చెందాయి. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం జరిగింది. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సంకటోనిపల్లిలో రైతు దావ శ్రీను ఒక ఆవు, గౌరారం గ్రామానికి చెందిన రైతు నిట్ట పర్వతాలుకు చెందిన రెండు ఆవులు పిడుగు పాటుకు గురై మృతి చెందాయి. తాము నష్టపోయామని ప్రభుత్వం చేయూతనివ్వాలని రైతులు కోరారు.
నందిగామలో మేకలు, గొర్రెలు మృతి
నందిగామ : నందిగామ మండలం దేవునిమామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు బోద్ద శంకరయ్య శుక్రవారం తన మేకలు, గొర్రెలను గ్రామ శివారులో మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కుడిన వర్షం కురవడంతో పిడుగు పడి నాలుగు మేకలు, నాలుగు గొర్రెలు మృతి చెందాయి.