వికారాబాద్, ఆగస్టు 27 : సీజన్ వ్యాధులతోపాటు, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వికారాబాద్ మండలంతోపాటు ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట, పూడూరు, నవాబుపేట, కోట్‌పల్లి, బంట్వారం మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. మంగళవారం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు వందల సం ఖ్యలో రోగులు వచ్చారు. దీంతో దవాఖాన అంతా రోగులతో నిండిపోయింది. 50 పడకల దవాఖాన కావడంతో రోగులకు సరిపడా బెడ్లు లేక ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
బెడ్లు లేకపోవడంతో చాలామంది రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. ఒక్క నెలలోనే 13 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. రోజు రోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నా దవాఖానలో మాత్రం బెడ్ల సంఖ్యను పెంచడంలేదని రోగులు మండిపడుతున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మాత్రమే ఓపీ చూడడంతో.. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారని.. ఓపీ సమయాన్ని మరింత పెంచాలని పలువురు కోరుతున్నారు.
350 పడకల దవాఖానను ప్రారంభించాలి
రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. సరిపడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 50 పడకల దవాఖాన కావడంతో రోగులకు సరిపడా బెడ్లు అందించలేకపోతున్నాం. ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్నాం. రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా పట్టణంలోని 350 పడకల దవాఖానను ప్రారంభిస్తే బాగుంటుంది. రోగులకు సరిపడా బెడ్లు అందుబాటు లో ఉంటాయి. అందరికీ మెరుగైన వైద్యాన్ని అందించొచ్చు.
– డాక్టర్ రామచంద్రయ్య, సూపరింటెండెంట్, వికారాబాద్