వికారాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అం దజేసే రూ.5 లక్షల అరకొర సాయం సరిపోకపోవడంతో అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బిల్లుల చెల్లింపుల్లో సర్కార్ తీవ్ర జాప్యం చేస్తున్నది. జిల్లాకు మంజూరైన ఇండ్లలో కేవలం 15 శాతమే పూర్తికాగా..నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు గత నాలుగైదు నెలలుగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. బెస్మెంట్ వరకు రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు రూ. లక్ష, స్లాబ్ లెవల్లో రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తైతే రూ.లక్షను సర్కార్ అందించాలని నిర్ణయించింది. ఆఖరు బిల్లు కోసం లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. జిల్లాకు 12,628 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు కేవలం 1,841 ఇండ్లే పూర్తయ్యాయి.
జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఆఖరి బిల్లు కోసం లబ్ధిదారులు కష్టాలు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తయిన ఇండ్లకు పంచాయతీ కార్యదర్శి మొదలుకొని హౌసింగ్ పీడీ, కలెక్టర్ స్థాయిలో పెండింగ్ బిల్లుల ఫైల్‌కు ఆమోదం తెలిపినా.. ప్రభుత్వం మా త్రం బిల్లులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. జిల్లాలో 1,841 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, ఆఖరి బిల్లు రూ.15.92 కోట్లు లబ్ధిదారులకు ప్రభుత్వం అందించాల్సి ఉన్నది. వికారాబాద్, తాం డూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఇండ్ల నిర్మాణం పూర్తైనా లబ్ధిదారులకు దాదాపు ఆఖరు బిల్లు కూడా పూర్తై రూ.5 లక్షల సాయం అందగా, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లకు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు నియోజకవర్గానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసినా.. ఆ ఊర్లలోనూ ఇండ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడం గమనార్హం. పైలట్ గ్రామాల్లో లబ్ధిదారులు కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించగా వారు కేవలం బెస్మెంట్ వరకే నిర్మించి బిల్లులు రాగానే తీసుకొని మిగిలిన పనులను వదిలేశారు. దీంతో చాలామంది లబ్ధిదారులు గతేడాదిగా గుడిసెలు, బాత్రుంలలో గడుపుతున్న పరిస్థితులున్నాయి. జిల్లాకు తొలి విడతలో 12,628 ఇండ్లు మంజూరు కాగా 3,535 ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించలేదు. కాగా, 9,093 ఇండ్లకు మార్కింగ్ వేయగా, 1,732 ఇండ్లు బెస్మెంట్ వరకు, 939 ఇండ్లు రూఫ్ లెవల్ వరకు, 3256 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయి.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం నిబంధనలను మార్చింది. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో బెస్మెంట్, రూఫ్, స్లాబ్‌ల వారీగా కాకుండా కేవలం స్లాబ్ నిర్మాణం చేపట్టినా రూ.2 లక్షల సాయాన్ని ప్రభుత్వం అందజేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షల అరకొర సాయంతో రూఫ్ లెవల్ వరకు ఇండ్లు బాగున్న లబ్ధిదారులు నిర్మాణానికి ముందుకు రావడం లేదు. దీంతో రూఫ్ రిప్లేస్మెంట్కు ప్రభుత్వం అవకాశమిచ్చింది. మరోవైపు జిల్లాకు రెండో విడతలో10 వేల ఇండ్లు మంజూరు కాగా, ఒక్కో నియోజకవర్గానికి 2500 ఇండ్లు కేటాయించారు. వాటిలో 1,500 ఇండ్లు రెగ్యులర్ రూ.5 లక్షల సాయాన్ని అందించాలని నిర్ణయించగా, మరో 500 ఇండ్లు కేవలం స్లాబ్ నిర్మాణానికి రూ.2 లక్షల సాయం, మరో 500 ఇండ్లు కూలిపోతే, అగ్నిప్రమాదం జరిగి కాలిపోతే, పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.