జిల్లాలోని వరి ధాన్యం ప్రైవేట్ మార్కెట్‌కు తరలుతున్నది. అన్నదాతకు మద్దతు ధరను అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. అక్కడ జరుగుతున్న నష్టం, ట్యాబ్‌లు సరిగ్గా పనిచేయకపోవడం, వివిధ రకాల కొర్రీలతో రైతులు దళారులు, వ్యాపారుల వైపు చూస్తున్నారు. తమ పంటను తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటి నా ఇప్పటివరకు 19, 675 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ వానకాలంలో అన్నదాతలు 1,30,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.
-వికారాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని అన్నదాతలు దాదాపుగా తమ వరి ధాన్యా న్ని ప్రైవేట్ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు, తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టడం, ట్యాబ్‌లు సరిగ్గా పని చేయకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా రైతన్నలు తక్కువ ధర వచ్చినా సరే అనుకుని వ్యాపారులు, దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలతోపాటు సమస్యలపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు.
దీంతో జిల్లాలోని మెజార్టీ రైతులంతా కొనుగోలు కేంద్రాల్లో కాకుం డా ప్రైవేట్ మార్కెట్‌కే ధాన్యాన్ని తరలిస్తున్నారు. మరోవైపు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా రైతుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉన్నది. సన రకం ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల కంటే బయటనే ఎక్కువగా విక్రయిస్తున్నారు. కొనుగోలు ప్రక్రియ షురూ అయి నెల రోజులు కాగా ఇప్పటివరకు కేవలం 571 క్వింటాళ్ల సన్నాలను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల సేకరించింది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటివరకు 19,675 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించింది. జిల్లాలో వానకాలంలో 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, మోసాలతో నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా ధాన్యం రాకపోవడం గమనార్హం. గత వారం రోజులుగా దౌల్తాబాద్, బషీరాబా ద్, ధారూరు, బొంరాస్‌పేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్‌లు పనిచేయకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించి..నిరీక్షించి చేసేదేమీ లేక ప్రైవేట్ మార్కెట్‌కు ధాన్యాన్ని తరలిస్తున్నారు. aమరోవైపు ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా పది, పదిహేను రోజులు దాటుతున్నా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. ధాన్యా న్ని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాలో ఇప్పటివరకు రూ. 39.20 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించిన జిల్లా పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు కేవలం రూ.23 కోట్ల చెల్లింపులు మాత్రమే పూర్తి చేయగా.. మిగతా సుమారు రూ.16 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాగా ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.2320, సాధారణ రకానికి రూ.2300 మద్దతు ధరను చెల్లిస్తున్నది. అయితే జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు.