బొంరాస్పేట, ఏప్రిల్ 7 : ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనది. దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతోపాటు మోసాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడా ది యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఐరిస్(కనుపాపలతో గుర్తింపు) విధానాన్ని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించా రు. ఇప్పటివరకు ఆధార్ అనుసంధానం, ఓటీపీ విధానం ద్వారా ధాన్యా న్ని కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఈ రెండింటితోపాటు ఐరిష్ విధానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయనున్నారు.
ఇప్పటివరకు రైతుల ఆధార్, బ్యాంకు ఖాతాల నంబర్లను ట్యాబ్లో ఎం ట్రీ చేయగానే అన్నదాతల మొబైల్ ఫోన్లకు ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీని ట్యాబ్లో నమోదు చేసి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తూకం చేసేవారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు, వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు వరి పంటను కొని.. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి సంబంధిత రైతుల పేర్లపైనే ఆ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందుతూ సొమ్ముచేసుకుంటున్నారు.
ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వం ఈసారి యాసంగి సీజన్ నుంచి ఐరిస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ధాన్యం విక్రయించే రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంటుంది. రైతు ఐరిష్ తీసుకున్న తర్వాతే ధాన్యాన్ని తూకం వేస్తారు. ఈ విధానంపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు శిక్షణ ఇచ్చి ఐరిష్ పరికరాలను కూడా అందించారు.
కౌలు రైతులు కూడా ఐరిస్ విధానంలో ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కౌలు రైతులు మొదట ఏఈవోలను కలి సి ఎవరి భూమిని కౌలుకు తీసుకున్నారో వారి వివరాలను నమోదు చేయించాలి. ఈ వివరాలను ఏఈవోలు ఓపీఎంఎస్(ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం)లో ఎంట్రీ చేస్తారు. దీంతో కౌలు రైతులు కూడా తాము పండించిన ధాన్యాన్ని వారే విక్రయించుకోవచ్చు.
వికారాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ధాన్యం దిగుబడిని బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. రైతులు ఈ యాసంగి సీజన్లో 85 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా 1.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ యాసంగి సీజన్ నుంచే ధాన్యం కొనుగోలులో ఐరిస్ విధానా న్ని అమలు చేస్తున్నాం. దీనిని ఎలా చేయాలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి ఐరిస్ పరికరాలను కూడా అందజే శాం. ఈ విధానం వల్ల ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టొచ్చు. అక్రమాలను అరికట్టొచ్చు.
-రాజేశ్వరరావు, వికారాబాద్ డీఎస్వో