వికారాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) ; ఈ ఏడాది వానకాలం ఎనుకపట్టు పట్టింది. గతంలో జూన్, జూలైలోనే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు మత్తడి దుంకాయి. ఎవుసం పండుగలా సాగింది. కానీ ఈ వానకాలం చుట్టపుచూపులా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినా ఏ ఒక్క చెరువులోకీ కొంతమేరైనా నీరు చేరలేదు. వికారాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు నీటినిల్వలు లేక నెర్రెలుబారిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. అన్నదాతలు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. గత కాలానికి.. ప్రస్తుత పరిస్థితులను గుర్తు చేసుకుంటే అంతా కలలా ఉన్నదని రైతన్నలు వాపోతున్నారు. జూన్లో ఒకట్రెండు సార్లు మోస్తరు వర్షాలు మినహా పెద్దగా వానలు కురిసింది లేదు. జూలై నెలలో గత రెండు, మూడు రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో భూమి తడిగా మారింది తప్ప చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు ఉన్నాయన్న భరోసా, భూగర్భజలాలు పెరిగాయన్న ధీమా లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఒక్క చెరువు కూడా వంద శాతం నిండిన దాఖలాలేదు.
వానకాలం ప్రారంభమై రెండు నెలలు ముగియవస్తున్నా వర్షాలు మాత్రం దోబూచులాడుతున్నాయి. సరైన వానలు లేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కళావిహీనంగా కనిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తుండడంతో జలకళ తప్పాయి. ఈ వానకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో ఏ చెరువు, కుంట, ప్రాజెక్టును చూసినా 25 శాతం మేర కూడా నీటినిల్వలు లేవు. మరోవైపు మూసీ, ఈసీ నదుల్లో ముళ్లపొదలు దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైనప్పటికీ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లాలోని అన్ని మండలాల్లో పెద్దగా వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు కూడా పెరుగలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలో భూగర్భజలాలకు సంబంధించి మే నెలలో 15.68 మీటర్ల లోతులో భూగర్భజలాలుండగా, జూన్లో 13.35 మీటర్లలో, జూలైలో కూడా పెద్దగా వర్షాలు లేకపోవడంతో 13 మీటర్లలోనే ఉండడంతో భూగర్భజలాల్లో ఎలాంటి మార్పు లేదు.
ఒక్క చెరువు కూడా సగమైనా నిండలే..
జిల్లావ్యాప్తంగా 1179 చెరువులుండగా, 85 వేల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉన్నది. తాండూరు డివిజన్లో 262 చెరువులు, కొడంగల్ డివిజన్లో 202 చెరువులు, పరిగి డివిజన్లో 398 చెరువులు, వికారాబాద్ డివిజన్లో 317 చెరువులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1179 చెరువులున్నప్పటికీ ప్రధానంగా 385 చెరువులు ఉన్నాయి. ఈ ప్రధాన చెరువుల్లో కేవలం ఒకే ఒక్క చెరువులో మాత్రమే 50 శాతానికిపైగా నీటినిల్వలు ఉండగా, మిగతా 384 చెరువుల్లో 25-50 శాతం లోపు మాత్రమే నీటినిల్వలు ఉన్నాయి. 25-50 శాతం మేర నీటినిల్వలు 361 చెరువుల్లో ఉండగా, 25 శాతంలోపు నీటినిల్వలు 21 చెరువుల్లో ఉన్నాయి.
ఆందోళనలో అన్నదాతలు..
జిల్లాలో వానకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. జూన్ నెలలో పెద్దగా వర్షాలు కురవకపోయినా గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయనే సంతోషమే తప్ప పెద్ద వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానకాలం ప్రారంభంలో కురిసిన ఒక్క వానకే తొందరపడి విత్తనాలు నాటిన రైతులకు ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. తదనంతరం వారం, పది రోజుల క్రితం మళ్లీ విత్తనాలను నాటినప్పటికీ ఇంకా వర్షం దోబూచులాడుతుండడంతో జిల్లా రైతాంగం అయోమయంలో పడింది. కేవలం ఒకట్రెండు మండలాలు మినహా మిగతా మండలాల్లో అంతంత మాత్రంగానే వర్షపాతం నమోదైంది. జూన్, జూలై నెలల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైందని చెప్పుకోవడానికి తప్ప ఏ మాత్రం భూగర్భజలాలు పెరగకపోవడం బాధాకరం.