యాచారం, డిసెంబర్ 24 : హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం రైతుల నుంచి అధికారులు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులుగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1126 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. శనివారం 301మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నట్లు డీటీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో రెండు కౌంటర్ల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట గ్రామంలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న హెచ్ఎండీఏ లే-అవుట్లో రైతులకు ప్రతి ఎకరాకు 121 గజాల ఇళ్ల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా భూ నిర్వాసితుల వద్ద నుంచి డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.