బొంరాస్‌పేట, ఫిబ్రవరి 29 : పదోతరగతి వార్షిక పరీక్షలకు ముందు విద్యాశాఖ విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నది. నేటి నుంచి జరుగనున్న ఎగ్జామ్స్‌తో విద్యార్థులు ఒత్తిడి లేకుండా రాసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ టెన్త్త్లో ఉత్తమ ఫలితా లు సాధించేందుకు గతేడాది డిసెంబర్ నుంచే ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాల నుంచి వచ్చే ప్రశ్నలు, ఛాయిస్ ఎలా ఉంటుంది, ప్రశ్నాపత్రం ఎలా ఉంటుం ది, ఏయే పాఠాలు చదివితే మంచి మార్కులు సాధించొచ్చనే సందేహాలకు విద్యార్థులు లోనవుతుంటారు.
ప్రీ-ఫైనల్ పరీక్షలపై వారికి అవగాహన కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో విద్యాశాఖ వీటిని నిర్వహిస్తున్నది. గతేడాది వరకు పదోతరగతిలో ఆరు పేపర్లకు పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది నుంచి భౌతికశాస్త్రం, జీవశాస్ర్తానికి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడంతో విద్యార్థులకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుం దని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నా రు.
పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం ఆ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులకు సన్నద్ధం అయ్యేందుకు సమయం ఇచ్చి మధ్యాహ్నం నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్న దృ ష్ట్యా ప్రీ-ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 4.45 వరకు మూడు గం టలపాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
పీ-ఫైనల్ పరీక్షలకు గతేడాది ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు పంపిన సెట్-2 ప్రశ్నా పత్రాలను వినియోగించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ ఆదేశాలతో గతేడాది ప్రశ్నాపత్రాలను భద్రపరిచిన చోట నుంచి ఇప్పటికే మండలాలకు ప్రీ-ఫైనల్ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఎంఈవోలు తీసుకుని ఉన్నత పాఠశాలలకు చేరవేశారు. మార్చి 1 నుంచి 11 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీ-ఫైనల్ పరీక్షలకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగనున్న పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఈ ఏడాది మంచి ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం గతేడాది డిసెంబర్ నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షా విధానంపై ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు పూర్తిగా అవగాహన కల్పించారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచిస్తున్నారు.
ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 13,074 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. అలాగే పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ చర్య లు చేపట్టింది. గతంలో వార్షిక పరీక్షల్లో ప్రశ్నా పత్రాలు లీకేజీ కావడంతో అప్రమత్తమైన అధికారులు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.