తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాసిరకం ఆహారం తినడం వల్ల పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిది మంది విద్యార్థినులను తాండూరు జిల్లా దవాఖానకు తరలించి మాతాశిశు విభాగంలో చికిత్స అందిస్తుండగా, నీలావతి అనే విద్యార్థిని హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. శనివారం విద్యార్థినుల తల్లిదండ్రులను మీడియా పలుకరించింది.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదని అడుగగా వారు కన్నీటిపర్యంతమయ్యారు. నాలుగు రోజులుగా వైద్యం అందిస్తున్నా తమ పిల్లలు కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లను అడిగితే ఆరోగ్యం మెరుగుపడుతున్నదని చెబుతున్నారని, బాగుంటే దవాఖానలో ఎందుకు ఉంచుతున్నారని డాక్టర్లను నిలదీశామన్నారు. అస్వస్థతకు గురైన రోజే దవాఖానలో చేర్చితే ఇప్పటికే కోలుకునేవారని, అధికారులు నిర్లక్ష్యం చేశారని విలపించారు.
ఎంత బతిమిలాడినా మా పిల్లలను చూపించలేదని, పాఠశాలలో నాణ్యమైన వైద్యమూ అందించలేదని ఆరోపించారు. పరిస్థితి విషమించడంతోనే దవాఖానకు తీసుకొచ్చారని, తమ పిల్లలకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం సరిగా పెట్టడం లేదని తమ పిల్లలు చెబితే… హాస్టల్ వార్డెన్‌కు చెప్పినా స్పందించలేదని వాపోయారు. ఇదిలా ఉండగా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడుగగా చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం కొంత మేర మెరుగుపడుతున్నదని చెప్పారు.
– తాండూరు, డిసెంబర్ 14
సర్కారు హాస్టల్లో చదువు, భోజనం బాగుంటుందని నమ్మి చేర్పించా. ఇలా ప్రాణాల మీదకు వస్తదనుకోలె. నాలుగు రోజులుగా తిండి తినబుద్ధి కావడంలేదు. నిద్ర వస్తలేదు. పిల్లలు పడుతున్న బాధను చూడలేక పోతున్నా. మొదటి రోజే దవాఖానకు తీసుకొస్తే బాగుండేది. నా బిడ్డను చూద్దామని వెళితే లోనికి పంపించలే. హాస్టల్ వార్డెన్, సిబ్బందిని కఠినంగా శిక్షించాలి.
– జయరాం, విద్యార్థిని తండ్రి, బషీర్‌మియాతండా
ప్రైవేటు బడిలో చదివించలేక హాస్టల్లో వేసినం. హాస్టల్లో తిండి సరిగా లేక నరకం అనుభవిస్తున్నరని అనుకోలె. పిల్లలు ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో హాస్టళ్లలో చదువు, భోజనం బాగుండే. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది.. హాస్టళ్ల పిల్లలు గోస పడుతుండ్రు. ఈ సర్కారుకు, హాస్టల్ సిబ్బందికి మా ఉసురు ముడుతది. బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
– రేణుక, విద్యార్థిని తల్లి, అడికిచర్ల
ఉడికీఉడకని ఆహారం తినడం వల్లే వాంతులు, విరోచనాలు అయ్యాయి. శరీరమంతా భరించలేని నొప్పి ఉన్నది. మళ్లీ హాస్టల్‌కు వెళ్లాలంటే భయంగా ఉన్నది. మంచి భోజనం, టిఫిన్ పెట్టరు. కొన్ని నెలలుగా భోజనం లేక, ఎవరికి చెప్పాలో అర్థం కాక చస్తున్నం. ఇదేమి ఆహారమని సిబ్బందిని అడిగితే పట్టించుకోకపోగా, మమ్మల్ని వేధించేవారు. వారిపై చర్యలు తీసుకోవాలి.
– గాయత్రి, 8వ తరగతి
దవాఖానకు వచ్చాక ఆరోగ్యం కాస్త బాగుంది. కానీ లేచే ఓపిక లేదు.. నీరసంగా ఉన్నది. కలుషిత ఆహారం పెట్టిన హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేయాలి. మా పరిస్థితి ఇలా ఉన్నదని అమ్మనాన్నలు, బంధుమిత్రులు ఎంత బాధపడున్నారో. దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా నాణ్యమైన భోజనం, టిఫిన్ పెట్టాలి.
– దీపిక, 6వ తరగతి