రంగారెడ్డి, సెప్టెంబర్ 6, (నమస్తే తెలంగాణ) : మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులను ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా మండల, గ్రామస్థాయిల్లో ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పచ్చళ్లు, స్వీట్లు, బేకరీ, డెయిరీ ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయడంతోపాటు బ్రాండ్, లేబుల్, ప్యాకింగ్ చేసి, ప్రత్యేకంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించి విక్రయించేందుకు ప్రణాళికను రూపొందించింది. ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వమే రుణాలను మంజూరు చేయనుంది. ఆసక్తి కలిగినవారిని ప్రోత్సహించేందుకు ప్రతి యూనిట్‌కు 35 శాతం సబ్సిడీని కూడా ప్రభుత్వం కల్పించనుంది. జిల్లాలో ప్రధానంగా పాల ఉత్పత్తులు, మామిడికాయ పచ్చళ్లు, మిర్చి పౌడర్, జొన్న, రాగి, సజ్జ పిండి, బేకరీ ఉత్పత్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తి నాణ్యతతో శుద్ధి చేసి ఫ్లిప్‌కార్ట్, మోర్, బిగ్ బాస్కెట్ లాంటి సంస్థల అనుసంధానంతో జిల్లాలోని ఆహార శుద్ధి కేంద్రాల ఆధ్వర్యంలో తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనున్నారు.
జిల్లాకు 210 ఆహార శుద్ధి కేంద్రాలు
జిల్లాలో 210 ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. మండలానికి పది ఆహార శుద్ధి కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈనెలాఖరులోగా 140 ఆహార శుద్ధి కేంద్రాలను ప్రారంభించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10లోగా 140 యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌లను పూర్తి చేసి, తదనంతరం గ్రౌండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. డీపీఆర్ ప్రక్రియ పూర్తైన అనంతరం వారు ఎంపిక చేసుకున్న యూనిట్లు, విలువను బట్టి ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ప్రత్యేకంగా ఐడీ, పాస్వర్డ్ కేటాయించనున్నారు. తదనంతరం ఎంపిక చేసుకున్న యూనిట్‌ను బట్టి అధికారులు ఆమోదం తెలుపనున్నారు. యూనిట్ ధరను రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు నిర్ణయించనున్నారు. లబ్ధిదారులు రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు విలువ చేసే ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చే లబ్ధిదారులకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, సీఎస్ఎఫ్ ద్వారా రుణాలను మంజూరు చేయనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఫరూఖ్‌నగర్ మండలంలో రూ.98 లక్షల విలువ చేసే బేకరీ ఉత్పత్తులు, మసాలా ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆహార శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నెలాఖరులోగా 140 శుద్ధి కేంద్రాలు : అమయ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరులోగా 140 ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం రుణాలను మంజూరు చేయనున్నారు. యూ నిట్ విలువను రూ.లక్ష నుంచి కోటి వరకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎంటర్ప్రైజెస్, ఆహార శుద్ధి కేంద్రాలులాంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నది.