వికారాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : అధికార పార్టీ కాంగ్రెస్‌లో అసంతృప్తి రాజుకున్నది. జిల్లాలోని ఎమ్మెల్యేలు మొదలుకొని జిల్లాస్థాయి నేతలు, నియోజకవర్గ, కిందిస్థాయి లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన నేతలు, చోటామోటా లీడర్ల వరకు పదవులు వస్తాయని సంబురాలు చేసుకున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా గెలుపు కోసం కష్టపడిన వారికి ఎలాంటి పదవులు రాకపోవడంతో వారిలో నిరుత్సాహం నెలకొన్నది. జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లల్లోనూ ఆ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలిచినా.. క్యాడర్లో ఒక్కరికి కూడా పదవులు ఇప్పించలేకపోయారు.
అంతేకాకుండా స్థానిక సంస్థల పదవీకాలం పూర్తై ఏడాది దాటినా ఎన్నికలను నిర్వహించకపోవడంతో క్షేత్రస్థాయిలోనూ అసంతృప్తులు ఎక్కువయ్యాయి. నిన్న, మొన్నటి వరకు ఆయా ఎమ్మెల్యేల వద్ద పదవుల గురించి ప్రస్తావించిన ఆశావహులకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో హైకమాండ్‌కు వ్యతిరేకంగా ధర్నాలకు దిగుతున్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే మాకు పదవులు ఇప్పించారా..? అంటూ ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల ఆశావహులు నిలదీస్తున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధి ష్ఠానంపై నరాజ్‌లో ఉన్నారు.
మంత్రి పదవి ఆశించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు తప్పక మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనుచరుల వద్ద ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. మరోవైపు స్పీకర్‌గా ఉన్న ప్రసాద్‌కుమార్ కూడా మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నైరాశ్యంలో ఉన్న ట్లు ప్రచారం జరుగుతున్నది.
పీసీసీ కార్యదర్శిగా ఉన్న వికారాబాద్ సెగ్మెంట్లోని ధారూరు మండలానికి చెందిన రఘువీరారెడ్డి పదవి కోసం అనుచరులతో ధర్నా చేయించారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు గాని, డీసీసీ అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ నుంచి సానుకూలత లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గం నేతలు పేర్కొంటున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల దృష్ట్యా ఆశావహుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టిన అధిష్ఠానం దూతలను రఘువీరారెడ్డి అనుచరులు కొట్టినంతా పనిచేశారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్-రఘువీరారెడ్డి మధ్య వైరం నడుస్తుండడంతో స్పీకర్‌కు పోటీగా తన అనుచరులతో ధర్నా చేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను పలుమార్లు కలిసేందుకెళ్లినా, పదవి కోసం లెటర్ ఇవ్వాలని కోరినా స్పీకర్ స్పందించడం లేదని రఘువీరారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రసాద్‌కుమార్ గెలిచేందుకు ధారూరు మండలంలో డబ్బులు ఖర్చు పెట్టిన తమ లీడర్‌ను దూరం పెట్టడంపై ఆయన వర్గం.. పీసీసీ పంపిన దూతల ముందు రఘువీరారెడ్డికి పదవి ఇవ్వాలంటూ అసంతృప్తిని వినిపించారు. మా లీడర్‌కు పదవి ఇచ్చిన తర్వాతే మిగ తా పదవుల గురించి ప్రస్తావించండంటూ ధర్నాకు దిగడంతో వారు చేసేదేమీ లేక ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయకుండానే సమావేశం నుంచి వెనుదిరిగారు.
ధారూరు : పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న రఘువీరారెడ్డికి పదవి వచ్చే వరకు తనకు ఎలాంటి పదవి వద్దని.. సామాన్య కార్యకర్తగానే కొనసాగు తానని ధారూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్‌కుమార్ పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కొందరు నేతలు జిల్లాలోని ఎమ్మెల్యేలకు తెలియకుండానే వారికున్న పరిచయాల ద్వారా పదవుల కోసం సీఎంను కలిశారు. స్థానికంగా తమను పట్టించుకోకుండా సొంతంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే తమకు పోటీగా గ్రూపులను నడుపుతున్న వారికి పదవులిస్తే లెక్కచేయరనే భావనతో జిల్లాస్థాయి పార్టీ పదవులతోపాటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కొందరు ఆశావహులకు ఎమ్మెల్యేలే చెక్ పెడుతున్నట్లు ప్రచా రం జరుగుతున్నది. ఎమ్మెల్యేల కుట్రను గుర్తించిన కొందరు లీడర్లు వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నట్లు తెలిసింది. కొందరు లీడర్లు బహాటంగానే తన అనుచరులతో ధర్నాలకు దిగుతుంటే, మరికొందరు మరొలా ప్ర యత్నాలు చేస్తున్నారు. ఇటీవల పీసీసీ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పోస్టులను జిల్లాకు చెందిన ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా ఒక్కరికి కూడా పదవులు దక్కకపోవడంతో అసంతృప్తి రాజుకున్నది. రానున్న రోజు ల్లో పీసీసీ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శుల పదవులతోపాటు డీసీసీ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. అదేవిధంగా మండల, బ్లాక్, జిల్లాస్థాయి పార్టీ కమిటీలను ప్రకటించేందుకు ఇప్పటికే అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు.