వచ్చే ఆర్థిక సంవత్సరానికి పని దినాలను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం
జిల్లాలో 17 లక్షల పనిదినాల తగ్గింపు
ఉపాధి కోల్పోనున్న లక్షల మంది పేదలు
బడ్జెట్లోనూ ఉపాధి హామీ పథకానికి అంతంత మాత్రంగానే నిధులు
ఈ ఆర్థిక సంవత్సరం 80.17 లక్షల పనిదినాలు కాగా, వచ్చే ఏడాది 63.09 లక్షల దినాలే..
మోదీ సర్కార్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రంగారెడ్డి జిల్లా ప్రజలు
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 22 : పేదల నోట్లో మట్టి కొట్టేలా కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి’ పని దినాలను తగ్గించింది. కూలీల బతుకుల్లో నిప్పులు పోసేలా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు సైతం ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో అంతంత మాత్రంగానే మోదీ సర్కార్ నిధులను కేటాయించింది. దీంతో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం 80.17 లక్షల పని దినాలు కేటాయించగా, వచ్చే ఏడాదికి 17 లక్షల పని దినాలను తగ్గిస్తూ 63.09 లక్షల పని దినాలను మాత్రమే కల్పించాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్‌కార్డులు ఉండగా 2,88,580 మంది కూలీలు ఉన్నారు. కూలీల పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది. ప్రధానంగా భూముల్లేని కూలీనాలీ చేసుకుంటున్న వారికి ఉపాధి హామీ పథకం జీవనోపాధిగా మారగా, భూములున్న రైతులు కూడా పంటల సాగు పూర్తయిన వెంటనే ఉపాధి హామీ పనులతో పూట గడుపుతున్నారు. ఏడాది పొడవునా ఉపాధి హామీ పథకంపైనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలున్నాయి. ఇంతవరకు భాగానే ఉన్నా.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పేదల నోట్లో మట్టి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అధిక సంఖ్యలో పని దినాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఇప్పటికే బడ్జెట్లో ఉపాధి హామీకి అంతంత మాత్రంగానే నిధులను కేటాయించిన కేంద్రం, పని దినాలను సైతం తగ్గిస్తూ నిర్ణయించింది. జిల్లాలో ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 17 లక్షల పనిదినాలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో లక్షల మంది పేదలు ఉపాధి కోల్పోనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 80.17 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మాత్రం 17 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 63.09 లక్షల పని దినాలను కల్పించాలని టార్గెట్‌గా నిర్ణయించారు. గతేడాది కొవిడ్ సమయంలో నగరాల్లోనివారు గ్రామాలకు తరలివెళ్లి ఉపాధి హామీ పని చేసి తమ కుటుంబాలను పోషించుకున్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏటా 20 వేల కుటుంబాలకు వంద రోజులపాటు ఉపాధి పనులు కల్పిస్తూ వస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 10 వేల కుటుంబాలకు కూడా వంద రోజులపాటు పని కల్పించడం కష్టంగా మారనుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒక్కో రోజు 30 వేల వరకు కూలీలు హాజరైన పరిస్థితులున్న దృష్ట్యా ఉపాధి హామీ పని దినాలను తగ్గించడంపై సర్వత్రా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
8220 కుటుంబాలకు వంద రోజులు
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు వంద రోజుల పనిని కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ఇప్పటివరకు 8220 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న కుటుంబాల్లో అత్యధికంగా మాడుగుల మండలంలో 924 కుటుంబాలు, యాచారంలో 888, కడ్తాల్‌లో 679, కందుకూరులో 683, మంచాలలో 667, తలకొండపల్లి మండలంలో 548 కుటుంబాలు ఉన్నాయి.
రోజుకు 8500 కూలీలకు పని
ఈ ఆర్థిక సంవత్సరం 80.17 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు 8500 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. భూములను చదును చేసే పనులతోపాటు మట్టి రోడ్ల నిర్మాణం, నీటి ఊట గుంతల నిర్మాణం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి నర్సరీల్లో మొక్కలు పెంచడం, ఇంకుడు గుంతల నిర్మాణం, నీటిఊట గుంతల నిర్మాణం, మట్టి రోడ్ల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమి చదునుచేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులను చేపట్టనున్నారు. ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటలు, వరద కట్టల నిర్మాణం పనులు చేపడుతారు.