వికారాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మరింత బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికం గా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప కాలిక వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణా షాపుల నిర్వహణకు గేదెలు, గొర్రెలు, మేకలను కొనేందుకు, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలను తీసుకుంటున్నారు. అయితే వికారాబాద్ జిల్లా లో ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రూ.411 కోట్ల వడ్డీలేని రు ణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం పెట్టుకోగా.. ఇప్పటివరకు 50 శాతం మేర రుణాలను మంజూరు చేసింది. అదేవిధంగా గతేడాది రూ. 361కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని..రూ.371.49 కోట్ల రుణాల ను బ్యాంకర్లు మంజూరు చేశారు. అయితే జిల్లా లో 657 గ్రామ సంఘాలు, 13,218 స్వ యం సహాయక సంఘాలు, 1.80 లక్షల మంది సభ్యులున్నారు. అంతేకాకుండా రుణాలను ఎప్పటికప్పుడు చెల్లించి తిరిగి పొందుతున్న సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ ఎస్‌హెచ్‌జీల పురోభివృద్ధికి చేయూతనందిస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి ఈ ఆర్థిక సంవత్సరం రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
రూ.217 కోట్ల రుణాలు మంజూరు..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాలకు 50 శాతం మేర(రూ.217 కోట్ల) రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రూ. 411 కోట్ల వడ్డీలే ని రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అత్యధికంగా కోట్‌పల్లి మండలంలో 64.13 శాతం, వికారాబాద్ మండలంలో 62.96శాతం, మోమిన్‌పేట మండలంలో 60.15 శాతం, చౌడాపూర్‌లో 58.43శాతం, నవాబుపేట మండలంలో 55.81శాతం, బంట్వారంలో 52శాతం మేర బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో ఐదు నెలల గడువున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేయాలని డీఆర్డీఏ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 6,241 స్వయం సహాయక సంఘాలకు రూ.214 కోట్ల రుణాలను మంజూరు చేశారు. దోమ మండలంలో 18.85 కోట్లు, కుల్కచర్ల మండలం లో రూ.18.14కోట్లు, యాలాల మండలంలో రూ.13.73కోట్లు, తాండూ రు మండలంలో రూ.13.41 కోట్లు, బొంరాస్‌పేట మండలంలో రూ.12. 35 కోట్లు రుణాలను మంజూరు చేశారు. మరోవైపు జిల్లాలో ఎన్పీఏ(పనిచేయని సంఘాలు)లపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొండికేసిన సంఘాలపై దృష్టి పెట్టి సంఘాల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా రుణాలను తిరిగి చెల్లించడంలో మొండికేసిన సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను కూడా నిలిపివేశారు.
వంద శాతం రుణాల మంజూరు
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల కు వంద శాతం రుణాలను మం జూ రు చేసేందుకు చర్య లు తీసుకుంటు న్నాం. ఇప్పటికే 50 శాతం మేర రుణాలను మంజూరు చేశాం. అన్ని మండలాల్లోనూ వంద శాతం రుణాలను మంజూరు చేస్తాం. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో స్వ యం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
-కృష్ణన్, డీఆర్డీవో వికారాబాద్