
వికారాబాద్, జూలై 4 : ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతితో పట్టణానికి కొత్త రూపురేఖలు రాబోతున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని 17వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో కలిసి మొక్కలు నాటారు. 25వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తడి, పొడి చెత్త వేరు చేయడంపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టణంలో సమస్యలను పరిష్కరించేలా దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం, కమిషనర్ బుచ్చయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, డీఎఫ్‌వో వేణు, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, కౌన్సిలర్ సురేశ్, నాయకులు రమణ, ఏఈ రాయుడు, ప్రత్యేకాధికారి ఆనంద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.వికారాబాద్ మండల పరిధిలోని పీరంపల్లి, పులుసుమామిడి తదితర గ్రామాల్లో నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ 6 మొక్కలు చొప్పున అందజేసి, పేర్లు నమోదు చేసుకున్నారు.
పచ్చదనం, పరిశుభ్రత అందరి బాధ్యత
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి జానకీరెడ్డి అన్నారు. ఆదివారం నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లి, దాతాపూర్ గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారితో కలిసి పర్యటించారు. నర్సరీలో మొక్కలు పెంపకం, సమస్యలపై ఆరా తీశారు. ఆయన వెంట మండల నవాబుపేట మండల ప్రత్యేకాధికారి లలితకుమారి, ఇన్చార్జి మండల అభివృద్ధి అధికారి శైలజారెడ్డి, ఎంపీవో, ఏపీవో, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలి
విరివిగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రేపల్లి నుంచి ఎన్నెపల్లి జంక్షన్ వరకు రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌కోసం డీఎఫ్‌వో వేణుమాధవ్‌తో చర్చించారు.
నాగిరెడ్డిపల్లిలో..
బొంరాస్‌పేట, జూలై 4 : మండలంలోని నాగిరెడ్డిపల్లిలో సర్పంచ్ హన్మంతు, ఎంపీడీవో పవన్‌కుమార్ మహిళలతో కలిసి పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేశారు. బురాన్‌పూర్‌లో సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి శ్రీనివాస్, మహిళలతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. రేగడిమైలారంలో సర్పంచ్ రాజేశ్వరి, ఎంపీటీసీ జగదీష్, గ్రామ ప్రజలు కలిసి వైకుంఠధామం, ప్రకృతి వనం పరిసరాల్లో మొక్కలు నాటారు.
స్వచ్ఛందంగా శ్రమదానం
మోమిన్‌పేట, జూలై 4: మండల కేంద్రంతో పాటు రాళ్లగుడుపల్లి, ఎన్కతల, సైదాలిపూర్, మొరంగపల్లి, ఎన్కేపల్లి, టేకులపల్లి మేకవనంపల్లి, కేసారం, ఇజ్రాచిట్టేంపల్లి తదితర గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెత్తాచెదారాన్ని తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం ర్యాలీగా వాడవాడలా తిరుగుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. హరితహారంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు ఆశావర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
కోట్‌పల్లి, జూలై 4 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేకాధికారి రాజేశ్వర్ అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో శ్రమదానం నిర్వహించారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో డానియల్, ఏపీవో అంజిలయ్యలతో కలిసి మండలంలోని ఎన్కెపల్లి, ఎన్నారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్తపై వేరు చేసేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ధారూరు, జూలై 4: ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారం గ్రామంలో శ్రమదానం చేసి, మొక్కలు పంపిణీ చేశారు. రుద్రారంలో మొక్కలు పంపిణీ చేయగా, ధారూరు మండల కేంద్రంలో శ్రమదానం, పాడుబడిన భవనం తొలగించారు. కుక్కింద గ్రామంలో మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్ల ఏర్పాటు, నర్సాపూర్ గ్రామంలో మొక్కలకు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్‌లో..
దౌల్తాబాద్, జూలై 4 : మండలంలోని నీటూర్, నర్సాపూర్, కౌడీడ్, దౌల్తాబాద్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి చక్రపాణి పాల్గొన్నారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ సర్పంచ్ శీరిషరమేశ్, నీటూర్ సర్పంచ్ వెంకటప్ప, నర్సాపూర్ సర్పంచ్హేమలత, ఎంపీటీసీలు ప్రవీణ్‌కుమార్, ఎంపీవో రవీందర్, సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
మర్పల్లిలో చెత్తబుట్టలు, మొక్కల పంపిణీ
మర్పల్లి, జూలై 4 : సర్పంచులు ఉమారాణి గోపాల్‌రెడ్డి, విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని పెద్దాపూర్, దార్గులపల్లి, కొంషట్పల్లిలో పల్లెప్రగతి పనులు నిర్వహించారు. పెద్దాపూర్ అనుబంధ గ్రామమైన కుడుగుంటలో చెత్త బుట్టలతో పాటు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను సర్పంచ్ ఉమారాణి గోపాల్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ యాదయ్య పంపిణీ చేశారు. దార్గులపల్లి గ్రామంలో ఎంపీడీవో వెంకట్రామ్‌గౌడ్, ఏపీవో సోమలింగం, సర్పంచ్ విజయ్‌కుమార్ తో కలిసి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం మధుకర్, ఈసీ విఠల్, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ మల్లయ్య, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.