రంగారెడ్డి, మార్చి 21 (నమస్తేతెలంగాణ) : పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షలు సజావుగా సాగాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 249 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 51,794మంది పరీక్ష రాయాల్సి ఉండగా 51,096మంది హాజరయ్యారు. 508మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9.30గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు.
కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకొచ్చి వారిని ఆయా కేంద్రాల్లోకి పంపారు. దీంతో పరీక్షా కేంద్రాలు విద్యార్థినీవిద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉండడంతో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లను పూర్తిగా మూసివేయించారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
కేంద్రాలకు వచ్చే విద్యార్థులను మెయిన్‌గేట్ల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు తదితర అన్ని మౌలిక వసతులను కల్పించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ సెంటర్లల్లో విద్యార్థుల వసతులపై కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వికారాబాద్ : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. వికారాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం 69 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆయన పట్టణంలోని జడ్పీహెచ్ఎస్, బాలురు, బాలికలు, సేయింట్ ఆంథోని హైస్కూల్, సంఘం లక్ష్మీబాయి బాలికల పాఠశాలలో ఏర్పాటు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులకు తాగునీరు, టాయిలెట్, విద్యుత్, వైద్య తదితర సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆయా కేంద్రాల ఇన్చార్జిలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్, మార్చి 21 : పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఎస్పీ సందర్శించి బందోబస్తును పరిశీలించారు. విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కేంద్రాల చుట్టుపక్కల అనవసరంగా తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, పరీక్షా కేంద్రాల సిబ్బంది ఎవరికైనా ఏదైనా సాయం అవసరమైతే సంబంధిత పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్, డయల్ 100ను సంప్రదించాలని ఆయన సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.