
కొడంగల్, సెప్టెంబర్ 6: వ్యవసాయం పూర్తిగా క్రిమి సంహాకర మందులపైనే ఆధారపడింది. దీంతో భూముల సారం దెబ్బతిని, పెట్టుబడి అధికమై, దిగుబడి తగ్గుతున్నది. ఇలాంటి రోజుల్లో ఆయా ప్రాంతాల్లో రైతులు సేంద్రియ ఎరువులపై అవగాహన పెంచుకుని కూరగాయలు, పండ్లతోటలు సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకంతో పెట్టబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ వస్తుందని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. దీంతో కొంతమంది రైతులు ధైర్యం చేసి సేంద్రియ ఎరువులతో సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. నియోజకవర్గంలో అధికంగా కంది, జొన్న పంటలు పండించేవారు. ప్రస్తుతం వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుని పత్తిపై ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలో ప్రప్రథమంగా బొప్పాయి సాగు చేస్తున్నారు పట్టణానికి చెందిన రైతు ఎక్బాల్. పట్టణంలో వెల్డింగ్ షాప్‌ను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకున్న 18ఎకరాల్లో అందరిలాగే ఆయా పంటలు సాగు చేస్తున్నాడు. ప్రతిసారి వర్షాలు విస్తారంగా కురవడం లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జహీరాబాద్‌లోని ఆయన స్నేహితుడు నయూమ్ ఇచ్చిన సలహాతో తనకున్న భూమిలోని 4 ఎకరాల్లో బొప్పాయి సాగు చేపట్టాడు.
తైవాన్ రెడ్లెడ్ రకం బొప్పాయి మొక్కలు
గతేడాది 4 ఎకరాల్లో 4300ల బొప్పాయి మొక్కలు నాటాడు. ప్రస్తుతం అందులో 2600ల మొక్కలు పెరిగి బొప్పాయి పండ్లు కాస్తున్నాయి. రెండేండ్ల పాటు కాత వస్తుందని రైతు తెలిపారు. ఆ తరువాత మొక్కలు తీసి, మరోమారు నాటుకోవాల్సి ఉంటుంది.
వేస్ట్ డీకంపోసర్పై అవగాహన
ఎక్బాల్ ఇద్దరు కుమారులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో తండ్రికి సాయపడుతూ యూట్యూబ్‌లో బొప్పాయి సాగును పరిశీలించారు. అప్పుడు వేస్ట్ డీ కంపోసర్ వాడకంతో వచ్చే ఫలితాలపై అవగాహన పెంచుకున్నారు. వేస్ట్ డీ కంపోసర్ వాడిన వారిని కొందరిని సంప్రదించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వేస్ట్ డీ కంపోసర్ను తయారు చేసుకుని మొదటి ప్రయత్నంగా నాటిని కొన్ని మొక్కలపై ప్రయోగం చేశారు. వేస్డ్ డీ కంపోసర్ను వాడిన మొక్కలు 15 రోజుల్లో పంచి ఫలితం కనిపించింది. మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు వాడిన ఆకులు సైతం పచ్చగా మారాయి.
వేస్డ్ డీ కంపోసర్ తయారీ..
వేస్డ్ డీ కంపోసర్ మందు ధర కేవలం రూ.20. దానిని 200ల లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లం వేసి 6 రోజుల పాటు కుళ్లబెట్టుకుంటే వేస్ట్ డీ కంపోసర్ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మోతాదు ప్రకారం మొక్కలపై పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చెట్టుకు వైరస్ సోకడంతో పండుకు పురుగు పట్టిన ప్రదేశం కాయ పైభాగం కుళ్లినట్లుగా కనిపిస్తుంది. కాయ లోపలి భాగంలో ఎటువంటి ప్రభావం ఉండదు. రూ.120తో రాళ్ల సున్నంను పిచికారీ చేస్తే పురుగు నశిస్తుంది. పంటను పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులు వాడుతూ సాగు చేస్తున్నట్లు రైతు ఎక్బాల్ తెలిపారు.
హైదరాబాద్ మార్కెట్లో కాయకు మంచి డిమాండ్
సేంద్రియ ఎరువులు వాడడంతో కాయ సైజు పెరుగుతున్నది. దీంతో చూసేందుకు చక్కగా కనిపిస్తున్నది. ఇతర ప్రాంతాల కాయల కన్నా ఈ కాయకు డిమాండ్ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో బొప్పాయి ధర కేజీ రూ.13 నుంచి 15 మాత్రమే పలుకుతున్నది. బయట మార్కెట్లో మాత్రం కేజీ రూ.30 నుంచి 50కి అమ్ముతున్నారు. ఇక్కడి కాయ రూ.80 వరకు కూడా అమ్ముడు పోతున్నది.
రెండు నెలల్లో లక్ష ఆదాయం
పంట సాగు చేపట్టిన నుంచి రెండు నెలలకు ఒకసారి కాయలు అమ్ముతున్నారు. 6 నుంచి 7 సార్లు కాయలు తెంపుతారు. ప్రతిసారి 3 నుంచి 4 క్విటాళ్ల దిగుబడి వస్తున్నది. క్వింటాలుకు రూ.13 వేల ఆదాయం వస్తున్నట్లు రైతు తెలిపారు.
పంటను కాపాడిన వేస్ట్ డీ కంపోసర్ మిశ్రమం
నాలుగు ఎకరాల్లో బొప్పాయి పండిస్తున్నాం. క్రిమి సంహారక మందుల కంటే సేంద్రియ ఎరువులతో తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి సాధించుకోవచ్చు. ఎలాంటి వైరస్‌నైనా తొలించి, పంటకు పూర్తి పౌష్టిక పదార్థాలను అందించే గుణం సేంద్రియ ఎరువులకు ఉంటుంది. సోలార్ ఫెన్సింగ్‌తో పంట రక్షణ చేసుకుంటున్నాం. తయారు చేసుకున్న వేస్ట్ డీ కంపోసర్ పంటను కాపాడుతున్నది.
– ఎక్బాల్, బొప్పాయి సాగు రైతు, కొడంగల్