రోడ్డు ప్రమాదాల నివారణకు వికారాబాద్ జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారుల్లో బ్లాక్ స్పాట్స్ (యాక్సిడెంట్స్ జోన్స్) గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించగా.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇరుకుగా ఉన్న రోడ్లు, మూల మలుపులను వెడల్పు చేయడం, ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకుండా ఉన్న చెట్ల పొదలను తొలగించడం, రేడియం స్టడ్స్, సూచిక బోర్డులు వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే జాతీయ రహదారిపై ఉన్న ఆయా గ్రామాల స్టేజీల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించడంతోపాటు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన చోట్ల నో పార్కింగ్ సైన్‌బోర్డులు, జీబ్రా క్రాసింగ్ మార్కింగ్ చేపట్టనున్నారు.
పరిగి, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. వికారాబాద్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రవాణా శాఖ అధికారులు గుర్తించారు. రహదారులు మెరుగ్గా ఉండటం తో వాహనాల వేగం పెరిగింది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందులో కొందరు మృతి చెందుతుండగా.. మరికొందరు తీవ్ర గాయాల బారిన పడుతున్నారు. రవాణా శాఖ అధికారులు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు 26 (బ్లాక్‌స్పాట్స్) ఉన్నట్లు గుర్తించారు. అందులో జాతీయ రహదారితోపాటు ఆర్అండ్బీ రోడ్లు ఉన్నాయి. ఆ రహదారుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఉన్నత సమావేశంలో ఇంజినీరింగ్ శాఖ అధికారులకు వారు పలు సిఫారసులు కూడా చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించి ఆయా ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు, సూ చిక బోర్డుల ఏర్పాటు వంటి పనులను చేపట్టాలని సూచించారు.
చర్యలు ఇలా..
జిల్లా పరిధిలోని జాతీయ రహదారితోపాటు ఆర్అండ్బీ రోడ్లలో బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించిన అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు మలుపులు ఉన్న దగ్గర రోడ్లను మరింత వెడల్పు చేయ డం, రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదలను తొలగించి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించేలా చేయడం.. రేడి యం స్టిక్కర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా జాతీయ రహదారిపై ఉన్న స్టేజీల వద్ద గ్రామాల నుంచి వచ్చే రోడ్లపై స్పీడ్‌బ్రేకర్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటిపై తెల్లటి రేడియం స్టిక్క ర్లు, సూచిక బోర్డుల ఏర్పాటు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కూడళ్లలోని ఆక్రమణల తొలగింపు, నో పార్కింగ్ సైన్‌బోర్డుల వంటివి ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులు ఇంజినీరింగ్ శాఖ అధికారులకు సూచించారు.
జిల్లాలోని బ్లాక్‌స్పాట్స్..
జిల్లాలో 26 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. ఆ రహదారుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. జిల్లా పరిధిలోని జాతీయ రహదారి-163పై అత్యధిక బ్లాక్ స్పాట్స్ ఉన్న ట్లు పేర్కొన్నారు. ఇందులో చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కండ్లపల్లి గ్రామ స్టేజీ, పూడూరు స్టేజీ, సోమన్గుర్తి గ్రామ స్టేజీ, పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రంగాపూర్ క్రాస్‌రోడ్డు, నజీరాబాద్తండా, పరిగి శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్, పరిగిలోని టెలిఫోన్ ఎక్సేంజ్, కొడంగల్ క్రాస్‌రోడ్డు, బ్రిలియంట్ స్కూల్ దగ్గర గల రోడ్డు మలు పు, తుంకులగడ్డ స్టేజీ, రూప్‌ఖాన్‌పేట్ స్టేజీ, గడిసింగాపూర్ స్టేజీ, బొంరాస్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుంకిమెట్ల క్రాస్‌రోడ్డు, నాగిరెడ్డిపల్లి, కొడంగల్ పట్టణంలోని రాఘవేంద్ర దవాఖాన సమీపంలోని క్రాస్‌రోడ్డు, సిద్ధ్దార్థ స్కూల్, చిట్లపల్లి వద్ద గల రోడ్డు మలుపు, నీటూర్ గ్రా మం, రావులపల్లి పెట్రోల్‌బంక్‌లను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. జాతీయ రహదారి-167పై తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి, అంతారం గ్రామ మలుపు, పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కందనెల్లితండా, మర్రెపల్లి స్టేజీ, ధారూర్ మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డు, కట్టమైసమ్మ ఆలయం, వికారాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి లు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు.
బ్లాక్ స్పాట్స్ గుర్తించాం
జిల్లా పరిధిలోని జాతీయ రహదారితోపాటు ఆర్అండ్బీ రోడ్లలో బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతా ల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ శాఖ అధికారుల కు పలు సూచనలు చేశాం. ఆ బ్లాక్ స్పాట్లలో సూచించిన విధంగా చర్యలు చేపడితే చాలావరకు ప్రమాదాలను నివా రించొచ్చు.
– బద్రు, వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి