ఆమనగల్లు : కాంగ్రెస్, బీజేపీలకు ఓసీలపై ఉన్న ప్రేమ బీసీలపై లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష పార్టీలతో వెళ్లి ప్రధానిని కలిసి పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42 శాతం అమలు చేసేలా ప్రధానిపై ఒత్తిడి తెచ్చేదన్నారు. కేవలం కంటితడుపు చర్యగా బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతికి పంపిందన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం జరగనున్న బీసీ బంద్‌కు నియోజకర్గంలోని బీఆర్ఎస్శ్రేణులు, ప్రజలు, వ్యాపారులు మద్దతు తెలిపి సక్సెస్ చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ సరిత, సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, సాయిలు, రమేశ్, వెంకటేశ్, రమేశ్‌నాయక్, యాదయ్య, జగన్, మహేశ్, గణేశ్, విమలమ్మ, లలిత పాల్గొన్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శనివారం బీసీ సంఘాలు తలపెట్టిన బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి..ఇప్పటికీ నెరవేర్చ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదన్నారు. బీసీలకు న్యాయం చేయాల్సిందేనని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకూ బీసీ సంఘాలు చేపట్టే పోరాటాలకు సహకారముంటుందన్నారు.
వికారాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి దేశం దృష్టి తెలంగాణ వైపు మల్లేలా చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమం ఏ విధం గా జరిగిందో.. అదే విధంగా బీసీ ఉద్యమమూ జరుగుతుందన్నారు. బీసీలను నాటి నుంచే కాం గ్రెస్ పార్టీ అణచివేతకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. దేశ ప్రధానిగా నెహ్రూ ఉన్నప్పటి నుం చే దేశంలో కులగణన చేయకుండా నిర్లక్ష్యం చేశారని, ఇప్పటికీ సరిగ్గా కులగణనే చేయలేదన్నారు. తమిళనాడు తరహాలో బీసీలకు 42% రాజ్యాధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మోసపూరిత హామీలిచ్చిందని మండిపడ్డారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ కల్పించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. 42% రిజర్వేషన్‌ను పార్టీపరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలన్నారు. శనివారం జరగబోయే రాష్ట్రవ్యాప్త బీసీ బంద్‌కు అన్ని రాజకీయపార్టీలు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని కుల సంఘాలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయ కులు సురేశ్‌గౌడ్, దత్తు, సిద్ధిక్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : బీసీ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు నిస్తుందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శుక్రవారం తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడు బీసీలకు మద్దతు ఇస్తూనే ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం నిర్వహిస్తున్న తెలంగాణ బంద్‌కు అందరూ సహకరించి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.