షాద్‌నగర్‌రూరల్ ఆగస్టు 30 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పోలీసులు ప్రజలతో మమేకమై రక్షణ కల్పిస్తుండడంతో నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సంఘ విద్రోహ చర్యలు తగ్గుముఖం పట్టాయి. గతంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు, నేరాల సంఖ్య ఎక్కువగా ఉండేవి. పోలీసులు చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు పోలీసుల సలహాలు, సూచనలను పాటిస్తుండడంతో శాంతిభద్రతలు నియంత్రణలో ఉంటున్నాయి.
షాద్‌నగర్ పట్టణం రాజధానికి కూతవేటు దూరంలో, అంతర్జాతీయ విమానాశ్రయానికి అతిచేరువలో ఉండడమే కాకుండా పాత జాతీయ రహదారి హెన్హెచ్ 44, ముంబాయి బైపాస్ రోడ్లు ఈ పట్టణం మీదుగా వెళ్తుడడంతో షాద్‌నగర్ పట్టణం భారీ వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. వ్యాపార, రియల్ రంగంలో జిల్లాలోనే షాద్‌నగర్ పట్టణం అగ్రగామిగా ఉండడంతో జిల్లా నలుమూలల నుంచి పట్టణానికి అనునిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేది.
2018లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు..
ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు 2018 జూలైలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐగా రఘుకుమార్ 2019 ఆగస్టు 13న బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమై ట్రాఫిక్ నిబంధనలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. హెల్మెట్ తప్పనిసరి చేయడానికి ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో సత్ఫలితాలు వచ్చాయి. హెల్మెట్ లేనిదే వాహనదారుడు రోడ్డుపైకి రావడం లేదంటే ప్రజలకు ఏ స్థాయిలో అవగాహన కల్పించారో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ సమస్య తీరడంపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలపై క్షేత్రస్థాయిలో అవగాహన
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా తక్షణమే ట్రాఫిక్ ఎస్ఐ సంఘటన స్థలానికెళ్లి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను దృశ్య రూపకంగా సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
తగ్గిన ప్రమాదాలు ..
2019 లో రోడ్డు ప్రమాదాలు 170 జరుగగా, 2020లో 110, 2021 ప్రస్తుతం 80 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల లేని షాద్‌నగర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు.
ఎస్ఐకి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు రాష్ట్ర అవార్డు
ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి ఎస్ఐ రఘుకుమార్ ఇటీవల చేపట్టిన రైడ్ సేఫ్ రీడ్ సేఫ్ బైకు ర్యాలీ విజయవంతమైంది. ఎస్ఐ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్, పోలీస్, ఫైర్ పోలీస్, కిరాణం, వస్త్ర, మెడికల్, రియల్ ఎస్టేట్, ఆటో, జీపు, మార్వాడీ, పాన్‌షాపు, డాక్యుమెంటరీ, బార్, మొబైల్, మైనార్టీ యూనియన్ల సభ్యులు సుమారు 3వేల మంది స్వచ్ఛందంగా హెల్మెట్లతో ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు రాష్ట్ర అవార్డును ఎస్ఐ రఘుకుమార్‌కు శంషాబాద్ ఏసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ కుషాల్కర్ అందజేశారు.
నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి: ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. నిబంధనలపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రాణాల కంటే వేగం ముఖ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదు. నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించవచ్చు. నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం.