మొయినాబాద్, నవంబర్ 5 : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 19 మంది మృత్యువాతపడటం ముమ్మాటికి ప్రభుత్వ హత్యనేనని రోడ్డు రహదారుల ఉద్యమ వేదిక సభ్యులు కొంపల్లి అనంతరెడ్డి, శాపూరం శ్రీకాంత్ అన్నారు. మూడు రోజుల క్రితం చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ సమీపంలో జరిగిన టిప్పర్-ఆర్టీసీ బస్ ప్రమాదం జరగడాన్ని నిరసిస్తూ రోడ్డు రహదారుల ఉద్యమ వేదిక కన్వీనర్ శాపూరం శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం మొయినాబాద్‌లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మహా ధర్నా చేశారు.
మహా ధర్నాలో ఉద్యమ వేదిక సభ్యులతో పాటు అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ధర్నా చేస్తున్న ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్కారు నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాలకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలే బాధ్యత వహించాలన్నారు. ప్రమాదంలో 19 మంది చనిపోగా.. ఎంతో మంది గాయాలపాలు కాగా.. సానుభూతి ప్రకటించాల్సిన ప్రజాప్రతినిధులు ఎవరికి వారు సంచలన ప్రకటనలు చేయడం దారుణమని పేర్కొన్నారు.
రోడ్లు బాగుంటేనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని ఎంపీ మాట్లాడుతుండగా.. మిర్జాగూడ వద్ద చనిపోయినవారు చేవెళ్ల ప్రాంతానికి చెందినవారు కాదని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అనడం విడ్డూరంగా ఉందని చెప్పారు. త్వరితగతిన రహదారి పనులు ప్రారంభించకపోతే సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు పనులు ప్రారంభించకపోతే ప్రజాప్రతినిదులును గ్రామాల్లో పర్యటించకుండ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకుడు అంజయ్యగౌడ్, మాజీ సర్పంచ్‌లున్నారు.