ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పూర్తయి భద్రాద్రి జిల్లాలో కొన్ని పంపుహౌస్‌ల ద్వారా నీళ్లు కూడా విడుదలవుతున్నాయి. కానీ, ఆ నీటిని ఖమ్మం జిల్లాలోని పాలేరుకు అనుసంధానం చేసేందుకు చేపట్టిన లింక్ కెనాల్, టన్నెల్ నిర్మాణ పనులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ముందుకు సాగడం లేదు. దీంతో ‘ఎన్నటికి పూర్తయ్యేను సీతారామా’ అంటూ తిరుమలాయపాలెం మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముమ్మరంగా సాగిన కాలువ నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొత్తానికే మూలనపడ్డాయి. రేవంత్ సర్కారు బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు కూడా పనులను నిలిపివేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాలువల నిర్మాణం కోసం భూసేకరణను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయలేదు. ‘అది అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో? గోదావరి జలాలతో పాలేరును నింపేదెప్పుడో? తమ పంట పొలాలకు సాగునీళ్లు అందించేదెప్పుడో?’ అనుకుంటూ స్థానిక రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలాయపాలెం, నవంబర్ 5; ఉమ్మడి జిల్లాలో దాదాపు ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిపై భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 104 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువల తవ్వకం పనులు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకానికి భూసేకరణ, టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పాలేరు లింక్ కెనాల్, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు సాగుతున్నాయి.
గత బీఆర్ఎస్ పాలనలోనే పాలేరు లింక్ కెనాల్‌ను రూ.1,600 కోట్లతో చేపట్టారు. ఏన్కూరులోని 104.4వ కిలోమీటరు వద్ద నుంచి పనులు ప్రారంభించారు. ఏన్కూరు నుంచి పాలేరు వరకు 76.925 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకుగాను 2,606 ఎకరాల భూమిని సేకరించాలి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే 758 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కెనాల్ 13, 14, 15, 16 ప్యాకేజీల పనులకు బీఆర్ఎస్ పాలనలోనే తవ్వకాలు జరిగాయి. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు జరగడం లేదు. పాలేరు లింక్ కెనాల్లో భాగంగా 13వ పాకేజీలో జూలూరుపాడు వద్ద టన్నెల్ తవ్వకం పనులు ప్రారంభమే కాలేదు. డోర్నకల్ మండలంలో 10 కిలోమీటర్ల కాలువ తవ్వకం పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 29 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉండగా.. కనీసం పనులు కూడా ముందుకు సాగడం లేవు.

ముగ్గురు మంత్రులున్నా.. ప్రయోజనం సున్నా..
సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలువల నిర్మాణ పనుల్లో తీవ్రమైన పనుల జాప్యం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రయోజనం శూన్యంగా కన్పిస్తోంది. నిధులు మంజూరు చేయించి పనులు త్వరితగతిన పూర్తిచేయించడంపై వారు శ్రద్ధ పెట్టకపోవడం పట్ల అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో ‘కందాల’ కృషితో..
తిరుమలాయపాలెం మండలంలో ఎనిమిది కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా కాలువ తవ్వకం పనులు మంజూరయ్యాయి. పాలేరు అప్పటి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి చొరవ తీసుకొని తిరుమలాయపాలెం మండల రైతులు తమ భూములను కోల్పోకుండా టన్నెల్ నిర్మాణానికి కృషి చేశారు. ఇప్పుడు ఆ పనులు కూడా వేగంగా సాగడం లేదు. నాలుగు కిలోమీటర్ల మేర మాత్రమే టన్నెల్ కాలువ తవ్వకం పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.165 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడం, అవి రాకపోవడం వంటి కారణాలతో సదరు కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. ఇటీవలి వర్షాలకు టన్నెల్లో భారీగా నీరు చేరడంతో పనులు చేపట్టే అవకాశం కూడా లేకుండాపోయింది. పాలేరు లింక్ కెనాల్ తవ్వకానికి కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో ఇంకా కొంత భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇటీవల ఖమ్మం కలెక్టర్ అనుదీప్.. బీరోలు, దమ్మాయిగూడెం వద్ద సీతారామ కాలువ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే భూసేకరణ పూర్తిచేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు జరగట్లేదు..
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాత్రమే పనులు వేగంగా జరిగాయి. ఈ ప్రభుత్వంలో అసలు పనులే జరగట్లేదు. పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేయాలి.
-చామకూరి రాజు, పీఏసీఎస్ మాజీ ఉపాధ్యక్షుడు, పిండిప్రోలు
త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తాం..
తిరుమలాయపాలెం మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తాం. తిరుమలాయపాలెం మండలంలో టన్నెల్ పనులు నాలుగు కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే 2026 నాటికి పాలేరు లింక్ కెనాల్ తవ్వకాన్ని పూర్తి చేస్తాం.
– బానాల రమేశ్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈఈ