మాడ్గుల మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆమనగల్లు/మాడ్గుల, జూలై 5 : కోటి ఎకరాల మాగాణిని తడిపి తెలంగాణను హరిత రాష్ట్రంగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ స్వప్నమని.. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 30 ఏండ్లలో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. సోమవారం మాడ్గుల మండలం జర్పులతండా, పల్గుతండా, ఆర్కపల్లి, బ్రాహ్మణపల్లి, మాడ్గులలో మంత్రి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జర్పులతండాలో వైకుంఠధామం, పల్లె ప్రకృతివనాలను పరిశీలించి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పాలకమండలిపై ప్రశంసల జల్లు కురిపించారు. పల్గుతండా, ఆర్కపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పద్మ, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు హీరాదేవి, జంగయ్య, జోజమ్మ, లక్ష్మయ్య స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు. మాడ్గులలో దాత పట్టాభి రాంరెడ్డి వితరణ చేసిన నూతన అంబులెన్స్, పది పడకల ప్రసూతి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాడ్గుల ప్రభుత్వ దవాఖాన ఆవరణలో సర్పంచ్ అంబాల జంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా.. ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రాజెక్టులకు అంకురార్పణ చేసినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే జిల్లా అంతా సుభిక్షమవుతుందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 1400 డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేశామని.. ప్రాధాన్యతా క్రమంలో అర్హులందరికి ఇండ్లను అందజేస్తామన్నారు. నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తానని ఆమె హామీనిచ్చారు. మాడ్గుల మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న దాత సూదిని పట్టాభి రాంరెడ్డిని ఆమె అభినందించారు. ఆయన స్ఫూర్తితో మండల అభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.
ప్రతి చెరువును సాగు జలాలతో నింపుతా..
జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు కాల్వ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చెరువును నింపేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. ఎత్తిపోతల కాల్వల పనుల్లో భూనిర్వాసితులకు రూ.20 కోట్ల నిధులు సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు చెప్పారు. మాడ్గుల మండలంలో రూ.12 కోట్లు, ఆమనగల్లు మండలంలో రూ.8 కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు తెలిపారు.
వెనుకబడిన మండలాలకు ప్రత్యేక నిధులు
పల్లెప్రగతి ద్వారా పల్లెల రూపురేఖలు మారాయని జడ్పీ చైర్‌పర్పన్ అనితారెడ్డి హర్షం వెలిబుచ్చారు. జిల్లాల్లో వెనుకబడిన పల్లెలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానన్నారు. ప్రజలంతా భాగస్వామ్యమై పల్లెలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగజ్యోతి, ఏస్ఈ గోపయ్య, డీఈ హన్మంత్‌రెడ్డి, ఏడీఈ శ్రీనివాస్‌రావు, సర్పంచులు జంగయ్య, వెంకటేశ్వర్లుగౌడ్, పద్మ, రమేశ్‌రెడ్డి, యాదిరెడ్డి, ఎంపీటీసీలు జైపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, పాండుగౌడ్, ఎంపీడీవో ఫారుఖ్‌హుస్సేన్, తహసీల్దార్ కృష్ణ, డా.లలిత ఉన్నారు.
పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి మాడ్గుల పర్యటనకు వెళ్తున్న మంత్రి సబితారెడ్డిని మండలంలోని నందివనపర్తి గ్రామంలో సర్పంచ్ ఉదయశ్రీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ రజిత, ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి కలిశారు. ప్రజలకు అభివాదం చేస్తూ మంత్రి సబితారెడ్డి గ్రామంలో చేపడుతున్న పల్లెప్రగతిపై సర్పంచ్ ఉదయశ్రీని అడిగి తెలుసుకున్నారు.