రంగారెడ్డి, నవంబర్ 5, (నమస్తే తెలంగాణ): కొన్నేండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చే ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధం చేసింది. పోడు భూములకు సంబంధించి ఇప్పటికే సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన అర్హులకు పట్టాలిచ్చేందుకుగాను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూముల వివరాలను గుర్తించిన జిల్లా అటవీ శాఖ అధికారులు ఆయా రైతులకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన అనంతరమే అర్హులుగా తేల్చనున్నారు. ముందుగా గ్రామ, డివిజన్ స్థాయిలో రైతులు, అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామ, డివిజన్ స్థాయిల్లో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు నిజమైన అర్హులని తేల్చిన అనంతరమే జిల్లా స్థాయి కమిటీకి సంబంధిత దరఖాస్తులు చేరనున్నాయి. తదనంతరం జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తర్వాత అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చే ప్రక్రియలో భాగంగా ఈనెల 8 నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. రైతుల నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దాదాపు నెలరోజులపాటు దరఖాస్తుల స్వీకరణతోపాటు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి, నిజమైన అర్హులను తేల్చనున్నారు. ఇందుకుగాను ఇప్పటికే అటవీ రైతు కమిటీలను జిల్లా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో 10-15 మంది సభ్యులుంటారు. ఈ కమిటీల్లో స్థానికంగా ఉన్న రైతులతోపాటు అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఉండనున్నారు. ఏ గ్రామాల్లో అయితే పోడు భూములు సాగు చేసుకుంటున్నారో, సంబంధిత గ్రామాల్లో అటవీ రైతు కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించనున్నారు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం డివిజన స్థాయి కమిటీకి అందజేయనున్నారు. డివిజన్ స్థాయిలోనూ సంబంధిత రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే జిల్లాస్థాయి కమిటీకి వివరాలను అందజేయనున్నారు.
అర్హులు వీరే..
పోడు భూములను సాగు చేసుకుంటున్న కుటుంబాలు 75 ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండాలి. వేరే ఇతర ఆధారం లేకుండా పోడు భూములపైనే ఆధారపడి ఉండాలి. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేరిట ఇతర భూములు ఉండరాదు, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండకూడదు. ప్రధానంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న కుటుంబాలు షెడ్యూల్డ్ తెగలకు చెందినవారై ఉంటేనే ప్రభుత్వం సంబంధిత పోడు భూములకు ఆయా రైతుల పేరిట పట్టాలిచ్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత భూములను సాగు చేసుకుంటున్న రైతుల కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఇతర భూములున్నట్లయితే సంబంధిత పోడు భూములను జిల్లా అటవీ శాఖ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోనున్నారు.
మండలాల వారీగా ఎకరాల వివరాలు..
జిల్లాలో 670 ఎకరాల్లో అటవీ భూములు కబ్జాలో ఉన్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తేల్చారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 780 మంది అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్లు గుర్తించారు. మంచాల మండలంలో 555 ఎకరాలు, హయత్‌నగర్ మండలంలో 32.11 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 10 ఎకరాలు, సరూర్‌నగర్ మండలంలో 58 ఎకరాలు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 15 ఎకరాల్లో అటవీ భూములు కబ్జాలో ఉన్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తేల్చారు. జిల్లాలోని మంచాల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని 69 గ్రామాల్లో అటవీ భూములు కబ్జాకు గురైనట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. అయితే అత్యధికంగా మంచాల మండలంలో పోడు భూములను సాగు చేసుకుంటున్నట్లు గుర్తించారు. మంచాల మండలంలోని రంగాపూర్ గ్రామంలో 15 మంది రైతులు 10 ఎకరాలు, తిప్పాయిగూడలో 102 మంది రైతులు 97 ఎకరాలు, తలపాల్లిగూడలో 294 మంది రైతులు 448.19 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. హయత్‌నగర్ మండలంలోని సాహెబ్‌నగర్‌లో 15 మంది రైతులు 32.11, ఇబ్రహీంపట్నం మండలంలోని పొల్కంపల్లిలో 10 మంది రైతులు 10 ఎకరాలు, సరూర్‌నగర్ మండలంలోని మన్సూరాబాద్‌లో 336 మంది రైతులు 58 ఎకరాలు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్‌లో 8 మంది రైతులు 15 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తేల్చారు.