రంగారెడ్డి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొన్ని రోజులుగా పూజలందుకున్న గణనాథులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. తుర్కయాంజాల్ మాసబ్‌చెరువు, పెద్దఅంబర్‌పేట్ బాతులచెరువు, శేరిగూడ చెక్‌డ్యాం, తట్టిఖానా చెక్‌డ్యాంతోపాటు జిల్లాలోని పలు చెరువుల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. లడ్డూల వేలం పాటలు పోటాపోటీగా సాగాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా పరిధిలో పలు వినాయకుల లడ్డూలకు రికార్డు ధర పలికింది. అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, బాలాపూర్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, గండిపేట, మొయినాబాద్ తదితర మండలాల్లో వినాయకుల లడ్డూలను భక్తులు లక్షలాది రూపాయలు వెచ్చించి దక్కించుకున్నారు. కాగా, బాలాపూర్ గణేశ్ లడ్డూను లింగాల దశరథగౌడ్ అనే వ్యక్తి రూ.35 లక్షలకు ధక్కించుకున్నాడు. గతేడాది రూ.30.1 లక్షలు పలికింది. ఈ గణనాథుడి లడ్డూకు రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. దీనిని దక్కించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారు వచ్చి వేలం పాటలో పాల్గొంటుంటారు. గణనాథుడి లడ్డూను దక్కించుకుంటే శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే లడ్డూల వేలంలో భారీగా భక్తులు పాల్గొంటుంటారు.
రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో వినాయకుడి లడ్డూను రూ.2.32 కోట్లకు దక్కించుకున్నారు. ఈ లడ్డూ కోసం నాలుగు బృందాలు వేలంపాటలో పాల్గొన్నాయి. బాల్ గణేశ్ టీం రూ. 2.32 కోట్లకు ఈ లడ్డూను దక్కించుకున్నది. ఈ డబ్బుతో ట్రస్ట్ ద్వారా పేదలకు ఉపయోగపడే పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని నిర్వాహకులు చెప్పారు.