మొయినాబాద్, జూన్ 27 : ప్రభుత్వం చేసేది గోరంతా.. చెప్పేది కొండంతా.. గొప్పలు చెప్పుకోవడం తప్ప చేయూత పింఛన్‌ను మాత్రం సకాలంలో అందించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి అజీజ్‌నగర్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గత రెండు రోజులుగా పింఛన్ లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.
గురువారం పింఛన్లు ఇస్తామని చెప్పడంతో ఉదయం 9 గంటల నుంచే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు అక్కడికి వచ్చి నిరీక్షించారు. సాయంత్రం వరకు కూడా పోస్టాఫీస్ సిబ్బంది రాకపోవడంతో వారు నిరుత్సాహంతో వెనుదిరిగారు. పోస్టాఫీస్ సిబ్బందికి ఫోన్ చేస్తే శుక్రవారం ఉదయం నుంచి ఇస్తానని చెప్పడంతో.. శుక్రవారం ఉదయమే పింఛన్లకోసం వచ్చారు.
మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా పింఛన్లు ఇచ్చేందుకు ఆ సిబ్బంది రాకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. మొదటి వారం లో రావాల్సిన పింఛన్లు నెలాఖరులో వస్తుండడం.. వచ్చిన డబ్బునూ సకాలంలో అందించడంలో పోస్టాఫీస్ సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తుండడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. అధికారులు స్పందించి పింఛ న్లు సక్రమంగా అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.