పరిగి, మే 11 : పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు అధికారులు. కరోనా ప్రభావంతో రెండేండ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు. రెండేండ్ల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్న ఈ తరుణంలో వికారాబాద్ జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలను జిల్లా విద్యా శాఖ అధికారులు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 164 జడ్పీహెచ్ఎస్ పాఠశాలలుండగా 7335 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలుండగా 476 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. 7 ఎయిడెడ్ పాఠశాలల్లో 254, 18 కేజీబీవీల్లో 843, 9 మోడల్ స్కూళ్లలో 875, 6 మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలల్లో 462, 10 ఎస్టీ ఆశ్రమ, గిరిజన గురుకులాల్లో 546, 6 టీఎంఆర్ఐఈఎస్లలో 290, 2 టీఎస్ఆర్ఈఐఎస్లలో 156, 9 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 709, 89 ప్రైవేట్ పాఠశాలల్లో 2494 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. జిల్లావ్యాప్తంగా 329 పాఠశాలల్లో 14,440 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
ప్రణాళికాబద్దంగా సన్నద్ధం
ఈసారి వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు కావాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇందుకుగాను విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్దంగా విద్యార్థులను చదివిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. ఉపాధ్యాయులు టైమ్‌టేబుల్ తయారు చేసి ప్రతిరోజూ ఒక సెక్షన్‌కు ఒకరు చొప్పున ఉపాధ్యాయులు హాజరై విద్యా శాఖ వారు అందజేసిన వివిధ సబ్జెక్ట్‌లవారీగా ప్రత్యేక మెటీరియల్, మోడల్ పేపర్లను పూర్తిస్థాయిలో చదివేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ఫైనల్స్ పరీక్షలు జరుగుతుండగా.. ఎప్పటికప్పుడు వాటిని మూల్యాంకనం చేసి విద్యార్థులకు అందజేస్తుండడంతో వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తున్నాయి. తద్వారా మరింత పట్టుదల, ఏకాగ్రతతో చదివేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం కేవలం పదో తరగతి విద్యార్థులే పాఠశాలలకు వెళ్తుండడంతో మరింత శ్రద్ధగా చదివేలా ఉపాధ్యాయులు సైతం తగిన ప్రోత్సాహం అందజేస్తున్నారు.
ఈసారి అంతర్గత వెసులుబాటు
ఈ నెల 23 నుంచి ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగే పదో తరగతి పరీక్షల్లో ఈసారి అంతర్గత వెసులుబాటు అధికంగా ఇవ్వడం గమనార్హం. ప్రధానంగా గతంలో సగం మార్కు ప్రశ్నను ప్రస్తుతం ఒక మార్కు, 2 మార్కుల ప్రశ్నకు 4 మార్కులు, 4 మార్కుల ప్రశ్నకు 8 మార్కులు కేటాయించనున్నారు. దీంతోపాటు ప్రతి అంశంలోని ప్రశ్నల్లో అంతర్గత వెసులుబాటు కల్పించడం ద్వారా విద్యార్థులు మరింత సులువుగా పరీక్షలు రాసేందుకు అవకాశం ఏర్పడింది. గత రెండేండ్లుగా కరోనా వల్ల తరగతుల నిర్వహణ సాధ్యం కాకపోవడం, ఈసారి తరగతులు కొనసాగినా రెండేండ్ల తర్వాత మళ్లీ చదవడం విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా మరింత సులువుగా పరీక్షలు రాసే విధానాన్ని సర్కారు అమలు చేస్తున్నది.
దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ విధానంపై అవగాహన కల్పిస్తూనే మరిన్ని మార్కులు సాధించేందుకు గల అవకాశాలను వారు సూచిస్తున్నారు. ప్రీ ఫైనల్స్ పరీక్షలు పూర్తయిన పది రోజుల తర్వాత వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రీ ఫైనల్ ద్వారా పరీక్షా పేపర్లు ఎలా వచ్చేవి విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. తద్వారా మిగతా రోజుల్లో మరింత పకడ్బందీగా, పట్టుదలతో చదివేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఏదిఏమైనా ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నది విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. అందుకనుగుణంగానే ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
వంద శాతం సాధించేలా సమాయత్తం;రేణుకాదేవి, జిల్లా విద్యా శాఖ అధికారి
జిల్లా పరిధిలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సమాయత్తం చేస్తున్నాం. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన స్టడీ మెటీరియల్‌ను సైతం అందజేశాం. ప్రతిరోజూ ఒక సెక్షన్‌కు ఒక ఉపాధ్యాయుడు చొప్పున హాజరై విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈసారి వచ్చే పరీక్షా పేపర్ల విధానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా మరింత చక్కగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉన్నది.