షాబాద్, అక్టోబర్ 1 : ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో అనురాధ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం నుంచి గ్రామాలకు బతుకమ్మ చీరలు చేరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని 37 రేషన్ దుకాణాల పరిధిలో 16,100 బతుకమ్మ చీరలు వచ్చాయన్నారు. నేటి నుంచి 14వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం నర్సింహులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు షాబాద్‌లో ఎమ్మెల్యే పంపిణీ
శనివారం ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కాలె యాదయ్య బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు తెలిపారు.
మండలానికి చేరుకున్న చీరలు..
జిల్లెడు చౌదరిగూడ మండలంలోని 22 పంచాయతీలకు 9 వేలు, కొందుర్గు మండలానికి 8వేల చీరలు వచ్చినట్లు ఏపీఎం నర్సింహ తెలిపారు. చీరల పంపిణీ పంచాయతీల్లో జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం నుంచి గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు తీసుకుని వచ్చి చీరలు తీసుకెళ్లాలని సూచించారు.