మొయినాబాద్, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని 111 జీవోను ఎత్తివేయడంతో రంగారెడ్డి జిల్లావాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనంతో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాజభజంత్రీలతో ర్యాలీలు తీసి, పటాకులను కాల్చారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జీవో రద్దుతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొన్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల ప్రజల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. జీవో రద్దు వల్ల పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పడితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 111 జీవో ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీ సం బోరు వేయలేని, శిథిలావస్థకు చేరిన ఇంటిని కూడా తిరిగి నిర్మించుకునే పరిస్థితి లేక కష్టాలను ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ వారి అవస్థలను తెలుసుకుని మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో 111 జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
111 జీవో రద్దు నిర్ణయాన్ని హర్షిస్తూ బుధవారం జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ ఆధ్వర్యంలో మొయినాబాద్‌లో ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్, మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారీగా పటాకులను కాల్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రతిసారీ ఆయనకు దండం పెట్టి 111 జీవో సమస్యను పరిష్కరించాలని అడిగేవాడినని, జీవో ఆంక్షలతో ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎంకు తెలిపేదన్నారు.
స్థానికుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ గుర్తించారని, అందుకే గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం జీవోను ఎత్తివేస్తూ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయంతో 84 గ్రా మాల ప్రజల 25 ఏండ్ల కల సాకారమైందన్నారు. జీవో 111 సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం దానిని ఎలా ఎత్తివేస్తుందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ఆ నాయకులకు ఈ ప్రాంతంలో కొన్ని ఎకరాల్లో భూములు ఉన్నాయన్నారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుతూ జీవోను ఎత్తివేసేందుకు సీఎస్ ఓ కమిటీని ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు.
అనంతరం రాష్ట్ర యువ నాయకుడు పీ కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. దీంతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబురాలు జరుపుకొంటూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధ్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నర్సింహ్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ శ్రీహరి, నాయకులు వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
84 గ్రామాల ప్రజల్లో వెల్లివిరిసిన ఆనందం
–చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో 84 గ్రామాల ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో 111 జీవో ఎత్తివేతను హర్షిస్తూ సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ 111 జీవోను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గణేశ్‌గుప్తా, మున్సిపల్ చైర్మన్లు సుష్మ, రేఖాయాదగిరి, మేయర్ మహేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ బండిగోపాల్, ఎంపీపీ జయమ్మాశ్రీనివాస్, వైస్ ఎంపీపీ నీలం, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, శ్రీనివాస్, సురేశ్, కౌన్సిలర్లు అజయ్, కుమార్, వెంకటేశ్, శ్రీకాంత్‌యాదవ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు.