సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 20, 2020 , 02:48:33

ప్రగతి ‘కాంతులు’

ప్రగతి ‘కాంతులు’

  • సిరిసిల్లలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు
  • పట్టణ ప్రగతిలో భాగంగా సమస్యల గుర్తింపు
  • విద్యుదీకరణకు రూ.4 కోట్ల మున్సిపల్‌ నిధులు
  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో శరవేగంగా సాగుతున్న పనులు

తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి స్ఫూర్తితో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సిరిసిల్ల బల్దియా పకడ్బందీగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నెల రోజుల పాటు పాలకవర్గ సభ్యులు మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటించి గుర్తించిన సమస్యలకు దశల వారీగా పరిష్కార మార్గం చూపుతోంది. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు కోట్ల రూపాయలతో పనులు చేపట్టడంపై పట్టణ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

                                                                                                                                                                                                                                                                                                      -సిరిసిల్ల టౌన్‌ 


30రోజులు.. 39వార్డులు..

మంత్రి కేటీఆర్‌ ఆశయానికి అనుగుణంగా సిరిసిల్ల పట్టణ సుందరీకరణే లక్ష్యంగా మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు ముందుకుసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నెల రోజుల పాటు అవిశ్రాంతంగా వార్డులన్నీ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించారు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలో మరమగ్గాల పరిశ్రమకు విద్యుత్‌ వినియోగం అధికంగా ఉండగా, సరఫరాలో ఎదురవుతున్న పలు సమస్యలను స్థానిక కార్మికులు పాలకవర్గ సభ్యులు, మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆ సందర్భంగా వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకొని రంగంలోకి దిగారు.

రూ.4కోట్ల నిధులు.. 

మున్సిపల్‌ పరిధిలోని 39వార్డుల్లో విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలకు గాను రూ.4కోట్లు మున్సిపల్‌ నిధులు కేటాయించారు. దీనిలో భాగంగా ఫుట్‌పాత్‌లపై ఉన్న పోల్స్‌ తొలగింపు, ఇండ్ల పైనుంచి వెళ్లే విద్యుత్‌ లైన్ల మళ్లింపు, హెచ్‌టీఎల్‌టీ లైన్‌ మార్పు, థర్డ్‌ వైర్‌ వంటి వివిధ పనులు చేపడుతున్నారు. అలాగే నూతన నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్న, అభివృద్ధి చెందుతున్న వార్డుల్లో సుమారు 700 విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా జయప్రకాష్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, శాంతినగర్‌, ఎల్లమ్మగుడి చౌరస్తా, మెయిన్‌రోడ్‌, ఇందిరానగర్‌, గణేశ్‌నగర్‌, నెహ్రూనగర్‌, ఎల్‌ఐసీ కార్యాలయం ఏరియా, కొత్త చెరువు, జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌ ఏరియాలలో అత్యధికంగా నూతన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు.

నిధుల కేటాయింపు ఇలా..

పట్టణంలోని అన్ని వార్డుల్లో 22 డ్యామేజ్‌ పోల్స్‌ గుర్తించగా వాటి స్థానంలో కొత్త స్తంభాల ఏర్పాటుకు రూ.28,91,518, చిన్న పోల్స్‌ 340 రీప్లేస్‌ కోసం రూ.6,35,545, నేలకొరిగిన స్తంభాలు 49 రీప్లేస్‌కు రూ.1,05,1397, తుప్పు పట్టిన స్తంభాలు 357 రీప్లేస్‌ కోసం రూ.70,28,663, థర్డ్‌వైర్‌ (510మీటర్లు) ఏర్పాటుకు రూ.96,66,222, హెచ్‌టీఎల్‌టీ షిఫ్టింగ్‌కు రూ.12,04,009, ఇండ్ల పైనుంచి ఉన్న విద్యుత్‌ లైన్ల (145చోట్ల) మళ్లింపునకు రూ.24,25,565, ఫుట్‌పాత్‌ మధ్యలో ఉన్న పోల్స్‌, లైన్స్‌ మార్పునకు రూ.5,85,3,278 నిధులను వెచ్చిస్తున్నారు. 

లోవోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం..

చేనేత వస్ర్తాల తయారీలో భీవండి తరువాత సిరిసిల్ల దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. పట్టణంలోనే సుమారు 40వేలకు పైగా మరమగ్గాలు నడుస్తున్నాయి. దాదాపుగా 20వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేతకార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లకు బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లను అందించారు. నాటి నుంచి సిరిసిల్ల సిరుల ఖిల్లాగా వర్ధిల్లుతోంది. చీరెల తయారీకి మరమగ్గాల పరిశ్రమకు ప్రధాన ఆయువు విద్యుత్‌ సరఫరా. ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి కేటీఆర్‌ సూచనతో పట్టణ ప్రగతిలో రూ.4కోట్లు నిధులు కేటాయించారు. భవిష్యత్‌ కాలంలో వస్త్ర పరిశ్రమతో పాటు గృహ వినియోగదారులు, వ్యాపార సముదాయాలకు విద్యుత్‌ సమస్యలు రాకుండా ఉండేందుకు గానూ ఈ నిధులతో చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా వార్డుల్లో 50శాతం మేర పనులు పూర్తి చేశారు. వంద శాతం విజయవంతంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు పూర్తయితే లోవోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది.

మంత్రి ఆదేశాలతో..

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పట్టణ ప్రగతిలో భాగంగా విద్యుత్‌ సమస్యలను గుర్తించాం. మున్సిపల్‌, సెస్‌ సిబ్బంది సంయుక్తంగా వార్డుల వారీగా సందర్శించి ప్రధాన సమస్యలు గుర్తించారు. వస్త్ర పరిశ్రమతో పాటు అనుబంధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గృహాలకు అందిస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఆయా చోట్ల లూజ్‌ లైన్‌, పోల్స్‌, థర్డ్‌ వైర్‌ తదితర సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు సమకూర్చుకొని పనులు చేస్తున్నాం. త్వరలోనే పనులు పూర్తి చేస్తాం. 

-వెల్దండి సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌, సిరిసిల్ల

లోవోల్టేజీ సమస్య ఉండదు..

వస్ర్తాల తయారీకి సిరిసిల్ల పెట్టింది పేరు. జౌళిశాఖ మంత్రిగా కేటీఆర్‌ స్థానిక నేతకార్మికుల స్థితిగతుల్లో మార్పులు తెచ్చేందుకు అందజేసిన బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు విజయవంతమయ్యాయి. 24గంటల విద్యుత్‌, చేతినిండా పని ఉండడంతో కార్మికులు ఆనందంగా ఉన్నారు. కాగా ఆయా చోట్ల చాలా సంవత్సరాల క్రితం వేసిన విద్యుత్‌ లైన్లు, కొత్తగా ఏర్పడ్డ కాలనీల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా రూ.4కోట్ల నిధులతో కొత్త విద్యుత్‌ స్తంభాలు, వైర్‌లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయితే లోవోల్టేజీ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.

-జిందం కళ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, సిరిసిల్ల