మంగళవారం 11 ఆగస్టు 2020
Peddapalli - Jul 10, 2020 , 02:34:40

ఉద్యమంలా హరితహారం

ఉద్యమంలా హరితహారం

  •  లక్ష్య సాధనకు సమన్వయంతో   కృషి చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
  • స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ఆరో విడుత హరితహారం  గంగాధర మండలంలో ఉద్యమంలా కొనసాగుతున్నది. లక్ష్య సాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతుండగా, ప్రజలు  సహకారం అందిస్తున్నారు.                     -గంగాధర 

 మండలంలోని 33 గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో జామ, ఉసిరి, అల్లనేరేడు, నిమ్మ, కృష్ణతులసి, ఖర్జూరా, వేప, చింత, మారేడు, గులాబీ, కానుగ, దానిమ్మ, సపోట, పనస, రేల,  బొప్పాయి, గన్నేరు, సీతాఫలం, రావి, టేకు, నల్లమద్ది, తంగేడు, తెల్లమద్ది, మేడి, మలబార్‌ వేప, తదితర పండ్లు, పూలు, నీడనిచ్చే సుమారు 4 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మండలంలో 2.5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. కాగా, ఇందులో విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల ఆవరణలో 5,100, దారులకు ఇరువైపులా 16,800, పొలం గట్లపై 4,600, ప్రభుత్వ స్థలాల్లో 77,500, చెరువుల వద్ద 3,500, చెరువు కట్టలపై 3,800, ఇండ్ల ఆవరణలో లక్షా 23 వేల 880 మొక్కలు నాటించాలని ప్రణాళికలు తయారు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ హరితహారం లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రోత్సహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గుంతలు తీయిస్తున్నారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. అలాగే, చెరువు కట్టలు, ఖాళీ ప్రదేశాలు, దారులకు ఇరువైపులా పంచాయతీల ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. గురువారం వరకు 33 గ్రామాల్లో సుమారు 41 వేల మొక్కలు ఇంటింటికీ పంపిణీ చేయడంతో పాటు నాటించారు. మరింత ఉత్సాహంగా పని చేసి లక్ష్యం మేరకు మొక్కలు నాటుతామని అధికారులు తెలిపారు. ఈసారి నాటిన మొక్కలు వందశాతం సంరక్షిస్తామని స్పష్టం చేస్తున్నారు.  logo