‘హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ వంటి ప్రపంచ స్థాయి సంస్థల విద్యను పొందేలా చేయాలన్నదే నా సంకల్పం. చాలామంది నేతలు తమ పిల్లలను విదేశాల్లో చదువు కోసం పంపాలని అనుకుంటారు. కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యను తెలంగాణకు తీసుకురావాలని అనుకుంటున్నాను. యువత భవిష్యత్తు, దేశ నిర్మాణం అనేవి రాజకీయాలకు అతీతంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ యూనివర్సిటీల సందర్శన సందర్భంగా వ్యాఖ్యానించారు.
విదేశీ విశ్వవిద్యాలయాలు మన దగ్గరకు వస్తే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా బ్రెయిన్ డ్రెయిన్‌ను అరికట్టవచ్చునని ప్రభుత్వం చెప్తున్నది. విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి కారణం కేవ లం అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువు కోసమే కాదు. నాణ్యమైన ఉపాధి, పరిశోధన అవకాశాలు, కెరీర్ అభివృద్ధి, పరిశ్రమలతో అనుసంధానం అనే అంశాలతో ముడిపడి ఉన్నదనేది వాస్తవం. రాష్ట్రంలో వందేండ్లు పూర్తిచేసుకున్న ఘనమైన కీర్తి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. తెలంగాణ సామాజిక, విద్య, సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో ఈ వర్సిటీ కీలక పాత్ర పోషించింది. అనేకమంది మేధావులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, పరిపాలకులు, ప్రజాప్రతినిధులను ఈ విశ్వవిద్యాలయం తయారుచేసింది. దీనితోపాటు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూలను బలోపేతం చేయకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు అవసరమా? అనే మౌలిక ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది.
ప్రపంచంలోని విదేశీ విద్య తెలంగాణకు వస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటుందా? లేదా భారీ ఫీజులు చెల్లించగలిగే కొద్దిమంది విద్యార్థులకు మాత్రమే పరిమితమవుతుందా? ప్రస్తుతం తెలంగాణలో 41 విశ్వవిద్యాలయ స్థాయి సంస్థలు ఉన్నాయి. వీటిలో 17 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 8 కేంద్ర విశ్వవిద్యాలయాలు లేదా జాతీయ ప్రాధాన్యతా సంస్థలు, 16 ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2,198 కళాశాలలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ఉన్నత విద్యావ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు, దానిని మరింత బలోపేతం చేయడమా? లేదా ప్రపంచ ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలను కొత్తగా తీసుకురావడమా?-ఈ రెండింటి మధ్య సమతుల్యతపై చర్చ జరుగాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలను మన దేశంలోకి ఆహ్వానించాలన్న చర్చ ఎప్పటినుంచో ఉన్నది. నూతన జాతీయ విద్యావిధానం2020లో కూడా ఉన్నత విద్య అంతర్జాతీయీకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. యూజీసీ 2023లో విదేశీ ఉన్నత విద్యాసంస్థలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకొనేలా ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. అయితే మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమితో కుదేలవుతున్న తరుణంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు స్వాగతం పలుకడం వల్ల అసలు ప్రయోజనం ఎవరికి? అనే ప్రశ్న కూడా ఉదయిస్తున్నది.
తెలంగాణలో ఇప్పటికే ఉన్న ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చుకున్నాయి. అధిక ఫీజులు, డొనేషన్లు, వివిధ పేర్లతో వసూళ్లు సామాన్య కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో రూపంలో విదేశీ విశ్వవిద్యాలయాలు ప్రవేశిస్తే విద్య మరింత ఖరీదైన వస్తువుగా మారే ప్రమాదం ఉన్నదనే ఆందోళన సహజమే. ప్రభుత్వ విద్యాసంస్థలు బలహీనపడుతున్నకొద్దీ వాటిపై ఆధారపడే పేద, మధ్యతరగతి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, సంచార జాతులు, దళితులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే ప్రధాన ఆధారం. అయితే విదేశీ వర్సిటీలు తెలంగాణలో ఏర్పాటైతే వాటిలో ఈ వర్గాల విద్యార్థులకు ఏ రకంగా విద్యను అందిస్తారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను పేదలకు ఇవ్వాలని ఉన్నా అమలు చేయలేని పాలకులు రేపు విదేశీ వర్సిటీల్లో ఈ వర్గాల విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్న మౌలికంగా ఎదురవుతున్నది.
భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి, సమాన అవకాశాలకు పునాది వేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్ విధానం వెనుక చారిత్రక, సామాజిక అసమానతలను తగ్గించాలనే లక్ష్యం ఉన్నది. విదేశీ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ఈ రాజ్యాంగ విలువలను అవి ఎలా అమలు చేస్తాయి. కేవలం విదేశీ బ్రాండ్ పేరుతో సంస్థలను తీసుకురావడం కాదు, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన విద్య, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కూడా నిర్ధారించాలి. విద్యను మార్కెట్‌కు అప్పగించి, పేద విద్యార్థులను బయట నిలబెట్టి ప్రపంచస్థాయి విద్యాసంస్థలు నిర్మించడం సామాజిక న్యాయం కాదు. విదేశీ విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఫీజుల విషయంలో నియంత్రణ లేకుండా వదిలేస్తే విద్యారంగంలో వాణిజ్యీకరణ మరింత వేగం పుంజుకొనే ప్రమాదం ఉన్నది. మన దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లకుండా, ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను బయట నుంచి దిగుమతి చేసుకోవడమే అభివృద్ధి నమూనా కాదనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ వంటి వాటిని ముందుకు తీసుకువస్తున్నది. నైపుణ్యాభివృద్ధి అవసరమే. కానీ నైపుణ్యం నేర్చుకున్న తర్వాత విద్యార్థులకు ఉద్యోగాలు పరిశ్రమలతో అనుసంధానం ఎలా ఉంటుంది?
విదేశీ వర్సిటీల నుంచి మంచి పద్ధతులను నేర్చుకోవచ్చు. అంతర్జాతీయ సహకారాన్ని పెంచుకోవచ్చు. పరిశోధన భాగస్వామ్యాలు చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి అధ్యాపకులను ఆహ్వానించవచ్చు. కానీ అదే సమయంలో మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసి విదేశీ సంస్థలపై ఆధారపడటం మాత్రం సరైన విద్యావిధానం కాదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే సంకల్పమే అసలైన విద్యా సంస్కరణ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలహీనపరిచి వాటికి ప్రత్యామ్నాయంగా విదేశీ విశ్వవిద్యాలయాలను నిలబెట్టడం మాత్రం విద్యలో సమానత్వానికి ప్రమాదకరం.