తెలంగాణ ఏర్పడిన తొలి ఏండ్లలో రాసుకున్న మాటలను మళ్లీ ఇవాళ గుర్తుచేయాల్సిన అవసరం ఏర్పడింది. ‘ఇవాళ తెలంగాణను రెండు రకాల ప్రతీప శక్తులు చుట్టు ముట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు ఒక తెరపైకి వస్తున్న ఈ సమయంలో ఓ దిక్కు వలసవాద శక్తులు మారు రూపాల్లో తెలంగాణలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నాయి. మరో దిక్కు తెలంగాణ సమాజంలో శతాబ్దాల తరబడి పాతుకుపోయిన మత సామరస్యం, సమ్మిళిత సహజీవన సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తూ మత తత్వాన్ని సమాజంలో ప్రోది చేసేందుకు జాతీయ మతతత్వ శక్తులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మతపరమైన విభజన ఆధారంగా అధికారంలోకి రావాలనేది ఆ శక్తుల లక్ష్యం.
ఈ రెండు రకాల ప్రతీప శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన ఒక చారిత్రక సందర్భం మళ్లీ ప్రజల ముందు సాక్షాత్కరించింది. ఈ నేపథ్యంలో మన అప్రమత్తతే మనలను రక్షిస్తుంది. లేకుంటే తెలంగాణ 60 ఏండ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో అరిగోస పడిన అనుభవాలను మరొక్కసారి మననం చేసుకోవాల్సి ఉన్నది’ అని గతంలో రాశాను. ఇటీవలి కాలంలో.. అంటే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి ఏపీలో చంద్రబాబు రెండవ సారి అధికారంలోకి వచ్చినాక జరిగిన కొన్ని సంఘటనలను విశ్లేషించినప్పుడు వలసవాదం మళ్లీ పంజా విసురుతున్నట్టు అర్థం అవుతున్నది. చరిత్రలో మనం ధోఖా తిన్న, మోసపోయిన అనుభవాలను ప్రస్తావించుకొని వర్తమానంలోకి వద్దాం.
పచ్చని తెలంగాణ రాష్ర్టాన్ని చూసి ఓర్వలేని వలసవాద శక్తులు కేంద్రంలోని మతతత్వ శక్తుల అండతో తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి దూకుడును పెంచాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే… తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో 20 దాకా ప్రశ్నలు టీడీపీ, ఆంధ్ర కాంట్రాక్టర్లపై వచ్చినట్టు పత్రికల్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి. వాటిపై సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. ఇదెట్లా సాధ్యమైంది? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పదేండ్ల పాటు రాని ఇటువంటి ప్రశ్నలు ఆంధ్రాలో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎందుకు వచ్చినట్టు? తెలంగాణ అధికార వ్యవస్థల్లో చంద్రబాబు దళారీలు చొరబడితేనే ఇది సాధ్యమవుతుంది.
చరిత్రలో నిర్లక్ష్యం ఫలితాలు: గతంలో మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అరవై ఏండ్లుగా ఎంతటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను చవి చూడవలసి వచ్చిందో ఆ చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం. 1956లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రూపొందించినప్పుడు బిల్లులో రాష్ట్రం పేరును ‘ఆంధ్రా- తెలంగాణ’గా ఖరారు చేశారు. బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపితే ఆ కమిటీ కూడా అదే పేరును ఆమోదించింది. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందే సమయంలో ఆంధ్ర లాబీయిస్టులు ఒక సవరణను ప్రతిపాదించారు. రాష్ట్రం పేరులోంచి ‘తెలంగాణ’ పదాన్ని తొలగించి ఆంధ్ర పక్కన ‘ప్రదేశ్’ అన్న హిందీ పదాన్ని చేర్చి రాష్ట్రం పేరును ‘ఆంధ్రప్రదేశ్’గా మార్చారు. ఆ సవరణతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది.
ఈ సవరణ ప్రతిపాదిస్తున్న సమయంలో తెలంగాణ లోక్‌సభ సభ్యులు బహుశా నిద్రపోతున్నారో! మరి సభలో లేరో! కొత్త రాష్ట్రం ‘ఆంధ్ర-తెలంగాణ’ పేరుతో కాక ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టుకతోనే తెలంగాణకు ద్రోహం తలపెట్టింది. తెలంగాణ అస్తిత్వానికి పాతర వేసింది.
తెలంగాణ పదం ఎప్పటికైనా తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రాజేస్తుందని వారికి తెలుసు. తెలంగాణ అస్తిత్వాన్ని శాశ్వతంగా ఖతం చేయడానికే ఆ సవరణ తీసుకవచ్చి తెలంగాణ పదాన్ని తొలగింపచేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ఆరు సూత్రాల పథకాన్ని ఎట్లా ఉల్లంఘించారో మనందరికీ తెలిసిన చరిత్రనే.రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సేవింగ్స్ పేరా 14: 1973లో జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించారు. ఈ పథకాన్ని తెలంగాణ నాయకత్వం ఎటువంటి విశ్లేషణ లేకుండా గుడ్డిగా అంగీకరించింది. హైదరాబాద్ రాజ్య ప్రజలు పోరాడి సాధించుకున్న ‘ముల్కీ రూల్స్’ రద్దు, పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక ప్రధాన అంశంగా ఉండిన తెలంగాణ ‘రీజినల్ కమిటీ’ రద్దు కూడా ఆరు సూత్రాల పథకంలో ఉన్నాయి. ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించి అన్ని ప్రాంతాలకు సమ న్యాయాన్ని కల్పించడానికి ఉద్దేశించినదే మూడవ సూత్రం. అందులో భాగంగానే రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డీని రాజ్యాంగంలో చేర్చారు. ఉద్యోగాల కల్పనలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం కల్పించడానికి ఒక ఉత్తర్వును జారీ చేయడానికి రాష్ట్రపతికి 371-డీ ఆర్టికల్ ద్వారా అధికారం సంక్రమించింది. అట్లా సం క్రమించిన అధికారంతో 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడినాయి.
ఆ ఉత్తర్వుల్లోని అంశాలను తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులు గాని, తెలంగాణ రాజకీయ నాయకులు గాని ఎవరూ చదివి ఉండరు. చదివినా, అందులోని కుట్రపూరితమైన పేరాలను పసిగట్టి ఉండరు. పసిగట్టినా, ఏమీ మాట్లాడలేక మిన్నకుండిపోయి ఉంటారు. రాష్ట్రపతి ఉత్తర్వులలో ‘పేరా 14’ అనే మినహాయింపుల క్లాజ్ (సేవింగ్స్ క్లాజ్) ఉన్నది. ఈ పేరా తెలంగాణకు ఎంతటి ఆర్థిక, సామాజిక నష్టాన్ని కలగజేసిందో అంచనా కట్టలేం. ఈ మినహాయింపుల పేరా కారణంగా సచివాలయంలో, శాఖాధిపతుల కార్యాలయాల్లో, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు ఉండవు. కాబట్టి, ఈ కార్యాలయాల్లో సీమాంధ్రులు దర్జాగా, రాజ మార్గంలో దిగబడిపోయారు. చట్టబద్ధంగానే హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యాగాలన్నీ సీమాంధ్రుల వశమయ్యాయి.
ఆర్టికల్ 371-డీ చెప్పిన అన్ని ప్రాంతాలకు సమన్యాయం ఇక్కడ భూస్థాపితమైంది. ఏపీ రాష్ట్ర అధికార కేంద్రమైన సచివాలయంలో తెలంగాణకు నామ మాత్రమైన ప్రాతినిధ్యమే దొరికింది. ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, భూ కేటాయింపులు, పర్మిషన్లు, పోస్టింగులు, ఇతరత్రా ప్రభుత్వ నిర్ణయాలు జరిగే సచివాలయంలోని కీలక పోస్టుల్లో ప్రాతినిధ్యం లేనందు వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా వివక్షకు లోనై అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల తెలంగాణ ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా తీవ్రంగా నష్టపోయింది.
వలసవాదం పొంచి ఉన్న పులి లాంటిది: 2014, ఫిబ్రవరిలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ చేస్తున్న సమయంలో తెలంగాణ సమాజం, రాజకీయ నాయకత్వం చూపించిన అప్రమత్తతే, జాగరూకత ఇప్పుడు కూడా అవసరమే. తెలంగాణ ప్రజలు సదా అప్రమత్తంగా ఉండవలసిందే. ఇప్పుడు వలసవాదం రూపం మార్చుకొని, నినాదం మార్చుకొని తెలంగాణలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నది. అప్రమత్తతనే మనకు రక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఊహించినట్టుగానే మొదటి నాలుగేండ్లు చంద్రబాబు పాలన తెలంగాణతో ఘర్షణ వైఖరితోనే కొనసాగింది. తన దళారీ వర్గంతో ఇక్కడ తన ఆధిపత్య రాజకీయాలను నడపాలని కలగన్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేశారు. అయితే, తెలంగాణ ప్రజలు ఈ ఆంధ్రా వలసవాద పార్టీలను తెలంగాణ పొలిమేరలు దాటించారు. తెలంగాణ ఉద్యమంతో వారి దళారీ వర్గాలు బలహీనపడ్డాయి. బలహీనపడ్డాయే తప్ప పూర్తిగా అంతం కాలేదు. వలసాధిపత్యం అదను కోసం వేచిచూసే పులి లాంటిది. ఈసారి రూపం మారింది. నినాదం మారింది. ‘రాజన్న రాజ్యం’ అంటూ తెలంగాణ ప్రజలను మత్పరించే ప్రయత్నంలో భాగంగా ఒక దుక్నం తెరిచి గొంతు చించుకుంటూ కొంతకాలం రాష్ట్రమంతా తిరిగారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాగు నీటి ప్రాజెక్టులను నిర్మించుకుంటూ, తెలంగాణకు అనాది ఆధారాలుగా ఉన్న చెరువులను బాగు చేసుకుంటూ, తెలంగాణ వాగుల మీద చెక్‌డ్యాంలు నిర్మించుకుంటూ, కృష్ణా, గోదావరి జలాల్లో తన వాటాను సంపూర్ణంగా వినియోగించుకుంటూ దశాబ్దాల నీటి గోసను తీర్చుకుంటున్న తరుణంలో రాజన్న రాజ్యం నినాదం పేరుతో ఆంధ్రా వలసవాదం తెలంగాణ రాజకీయరంగం మీదికి చొరబడే ప్రయత్నాలు చేసి భంగపడింది. తెలంగాణ ప్రజలు స్పందించకపోయేసరికి తోక ముడిచి తెలంగాణలో దుక్నం ఎత్తేసి ఆంధ్రాలో ఉన్న మరో పాత దుక్నంలో కలిసిపోయింది. ఆంధ్రాలో చంద్రబాబు రెండవ సారి అధికారంలోకి రావడంతో తెలంగాణలో బలహీనపడిన వలసవాద శక్తులు జాతీయ మతతత్వ శక్తులతో మిలాఖతై తెలంగాణలో చొరబడాలని, తెలంగాణను ఆగం చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
దూకుడు పెంచిన వలసవాద శక్తులు: పదేండ్ల కేసీఆర్ పాలనాకాలంలో హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదుగుతున్న దిశలో పయనించింది. అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్, గూగుల్, ఉబర్, సేల్స్‌ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ ఇంటర్నేషనల్ క్యాంపస్‌లు నిర్మించుకున్నాయి. దీనివల్ల లక్షల మంది యువకులకు ఐటీరంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. హైదరాబాద్ నగరం అప్రతిహతంగా అభివృద్ధి దారిలో పరుగెడుతున్న దశ. రాష్ట్రంలో కాళేశ్వరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల నుంచి సరఫరా అవుతున్న నీటితో, పచ్చని పంటలతో, ఎండకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్న చెరువులు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతుండేవి.
ఉమ్మడి రాష్ట్రం కరువు జిల్లాగా, వలసల జిల్లాగా దేశంలో పేరు పొందిన పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా నీటి గోస నుంచి బయటపడింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, చెరువుల ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందినందున మహబూబ్‌నగర్ జిల్లా కరువు నుంచి దూరమైంది. జిల్లా నుంచి వలసలు బందయ్యాయి. వ్యవసాయం పుంజుకోవడంతో ఆ జిల్లాకే పొరుగు రాష్ర్టాల నుంచి ప్రజలు ఉపాధి కోసం వస్తున్నారు. చెరువుల్లో ఏడాది పొడుగూతా నీరు నిండుగా ఉండటం, వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణం కావడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు అనూహ్యంగా పైకి లేచాయి. బోర్ల కింద వ్యవసాయం పుంజుకున్నది. ఒకవైపు రైతు సంక్షేమ పథకాలు, మరోవైపు పుష్కలంగా రెండు పంటలకు సాగునీరు అందడంతో రైతన్నకు వ్యవసాయంపై భరోసా పెరిగింది.
కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదగడానికి రైతాంగం శ్రమపడింది. వ్యవసాయం ద్వారా అత్యధికంగా ఆదాయం పొందే రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. అన్ని మానవాభివృద్ధి సూచికల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలబడింది.
ఇవన్నీ నిజమని ఎవరో కాదు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు స్పష్టంచేశాయి. ఇదిలా ఉంటే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న పాలమూరు రంగారెడ్డి, వార్ధా, సవరించిన కాళేశ్వరం డీపీఆర్‌లను కేంద్రం వెనక్కి పంపినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతుల ప్రక్రియ ఆగిపోయింది.
ఆంధ్రలో అధికార మార్పిడి జరిగిన కొద్ది నెలల్లోనే ఈ డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయంటే చంద్రబాబు ప్రభుత్వం ఢిల్లీలో వేసిన ఎత్తుల వల్లనే అని అర్థమవుతున్నది. పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించిన తర్వాతనే గత ప్రభుత్వం డీపీఆర్‌ను కేంద్ర జల సంఘానికి, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహా మండలి (ఈఏసీ) కూడా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి జారీ చేయమని మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఏడాది గడిచిన తర్వాత ఈఏసీ సిఫారసు ఉన్న ప్రాజెక్టు డీపీఆర్‌ను పర్యావరణ అనుమతి ఇవ్వకుండానే కేంద్రం వెనక్కి పంపించిందంటే చంద్రబాబు ఒత్తిడి ఏ మేరకు ఉన్నదో అర్థమవుతున్నది. ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రానికి షికాయతులు చేస్తూ పదుల సంఖ్యలో లేఖలు రాసిన సంగతి మరచిపోరాదు. ఆంధ్రా రైతులతో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించి ప్రాజెక్టు పురోగతిని అడ్డుకున్నాడు. ఇప్పుడు గోదావరి బనకచర్ల (పోతిరెడ్డిపాడు తూము కింద ఉన్న హెడ్ రెగ్యులేటర్ కాంప్లెక్స్) లింకు ప్రాజెక్టును సుమారు రూ.80 వేల కోట్ల కేంద్ర నిధులతో పూర్తిచేయాలని సంకల్పించాడు. 300 టీఎంసీల గోదావరి నీటిని తరలించే ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పౌర సమాజం మదింపు చేయాల్సి ఉన్నది. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి రాష్ట్ర సర్కారు సహకరిస్తుందట. ఎందుకు? తెలంగాణలో ఇప్పటికే ఊరూరా ఏర్పాటై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు తక్కువైనాయా? తెలుగు జాతి పేరు చెప్పి మళ్లీ తెలంగాణను వలసవాదానికి బలి చేయడానికా? బలహీనపడిన వలసవాద దళారీ శక్తులు తిరిగి తెలంగాణలో తలెత్తుకోవడానికా?
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో వీక్షణం స్టాల్ మీద ఎప్పుడో ముద్రణ అయిన ఒక పుస్తకాన్ని అమ్ముతున్నందుకు మతతత్వ వాదుల దాడి జరిగిన సంగతి విస్తృతంగా చర్చకు వస్తున్నది. ఆ ఘటన అనంతరం వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూనే ఉన్నారు. వేణుగోపాల్ చేసిన నేరమేమిటి?
కాలానికి కాపలా కాయాలి: పొలిమేరలు దాటిన వలసవాదం జాతీయ మతతత్వ శక్తుల అండతో తిరిగి మరో రూపంలో తెలంగాణలో చొరబడడానికి దూకుడు పెంచింది. తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండకపోతే బలహీనపడిన వలసవాద దళారీవర్గాలు బలం పుంజుకుంటాయి. తెలంగాణను వలసవాద శక్తులతో మిలాఖత్ అవుతున్న మతతత్వ శక్తుల బారిన పడకుండా కాపాడుకోవలసిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం మీదనే ఉన్నది. కవి, రచయిత పరవస్తు లోకేశ్వర్ ఉద్యమ సమయంలో అన్నట్టు ‘ఇప్పుడు కూడా కనురెప్పలు కత్తిరించుకొని కాలానికి కాపలా కాయాలి’.
-శ్రీధర్ రావు దేశ్‌పాండే
94910 60585