పాలు పోసి, పెంచి పోషించినంత మాత్రాన విషసర్పం కాటేయకుండా ఉంటుందా? డబ్బులు పెట్టి, పెంచి పోషించినంత మాత్రాన యూట్యూబ్ జర్నలిజం తిరగబడకుండా ఉంటుందా? ఇప్పుడు అదే జరుగుతున్నది తెలంగాణలో. నాడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌రెడ్డి స్వయంగా విషం నింపి, పెంచి పోషించిన యూట్యూబ్ జర్నలిజం ఈ రోజు ఆయనపైనే విషం కక్కుతున్నది. తన చేతుల మీదుగా పెరిగిన యూట్యూబర్స్ తన మీదనే తిరగబడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు. అసహనంతో అసెంబ్లీలో ఊగిపోతున్నారు. నాడు కన్నూ మిన్నూ కానరాక తాను చేసిన వికృత క్రీడలను మరిచి, తనదాకా వచ్చేసరికి నేడు ‘అధ్యక్షా..’ అంటూ ఆవేదన చెందుతుండటం హాస్యాస్పదం.
యూట్యూబ్ జర్నలిజం, సోషల్ మీడియా జర్నలిస్టుల వల్ల లాభమో, నష్టమో చర్చించేముందు అసలు దాన్ని పెంచిందెవరు? పోషించిందెవరు? అనేది తెలంగాణ సమాజం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో మన రాష్ట్రంలో యూట్యూబ్‌లు, రేవంత్ చెప్పే ట్యూబ్‌లు అసలున్నాయా? తన రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ సమాజంలో ఈ సోషల్ విషాన్ని నింపిందెవరు? కనుగోలు వంటి టీంలను కొనుగోలు చేసిందెవరు? వాక్ స్వాతంత్య్రం పేరిట, ప్రతిపక్షం పేరిట తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై విషం కక్కిందెవరు? మార్నింగ్ న్యూస్ పేరిట మాన, మర్యాదలు మరిచి బూతు పురాణం, తిట్ల దండకంతో రెచ్చిపోయిన యూట్యూబ్ జర్నలిస్టులకు అండగా నిలిచిందెవరు? రాజ్యాంగం వారికేవో ప్రత్యేక హక్కులు కల్పించినట్టు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోటికి వచ్చింది వాగుతుంటే పక్కనే ఉండి సహకరించిందెవరు? బొడ్డు కోసి ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడుతుంటే నవ్వులు చిందించిందెవరు? అంతవరకు ఎందుకు ప్రతిపక్ష హోదాలో ఉన్నానన్న సొయిని మరిచి మాజీ మంత్రి కేటీఆర్ తనయుడిపై మీరు బాడీ షేమింగ్ చేయలేదా? ఇప్పుడు మీదాకా వచ్చేసరికి ఆ నొప్పి తెలుస్తున్నదా? అయినా జర్నలిస్టుల పేరిట కొందరు అప్పుడు వికృతానందం పొందితే.. నేడు మీ ప్రజాపాలనలో కష్టాలు పడలేక మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలే తిడుతున్నారు. అంతే తప్ప జర్నలిస్టులు మిమ్మల్ని దూషించడం లేదు. మీ తప్పులను ఎత్తిచూపుతున్నారంతే. అంతమాత్రాన యూట్యూబ్ జర్నలిస్టుల తోడ్కలు తీస్తారా? బట్టలిప్పించి రోడ్డుపై పరిగెత్తిస్తారా?
ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాను గుప్పెట్లో పెట్టుకున్నది. రేవంత్ పాద ధూళిని చూసి పరవశించిపోతున్న పచ్చ మీడియా.. వాస్తవాలను వక్రీకరిస్తున్నది. నిజాలను బయటకు రానివ్వడం లేదు.
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లెలో మాజీ సర్పంచ్ ఒకరు సీఎం సోదరుల పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడితే… అతిపెద్ద సర్కులేటెడ్ డైలీ అని చెప్పుకొనే ఓ పేపర్ ఆ వార్తను జిల్లా ఎడిషన్‌లోని రెండో పేజీలో ప్రచురించింది. అది కూడా సీఎం సోదరుల పేర్లు రాకుండా జాగ్రత్త పడి మరీ. అదే కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి దుశ్శాసన పర్వానికి దిగితే సీఎం ఆస్థాన మీడియా ఆ వార్తను కనీసం కవర్ చేయలేదు. కొన్ని పచ్చ పత్రికలైతే వాళ్లసలు జర్నలిస్టులే కాదని ప్రచారం చేశాయి. జర్నలిస్టులు కాకపోయినంత మాత్రాన వారిపై దాడులకు దిగుతారా? కొండారెడ్డిపల్లిలో 100 శాతం రుణమాఫీ జరిగి ఉంటే వాళ్లను కాంగ్రెస్ నాయకులే సాదరంగా ఆహ్వానించి ప్రజలతోనే నిజాలు చెప్పించవచ్చు కదా? దాడులకు తెగపడటం ఎందుకు? నిజాలను పచ్చ పత్రికలు, రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా సమాధి చేస్తున్న ప్రస్తుత తరుణంలో యూట్యూబ్, సోషల్ మీడియా జర్నలిజం వాస్తవాలను ప్రజలకు కండ్లకు కట్టేలా చూపుతున్నది. ఆ వాస్తవాలను జీర్ణించుకోలేకనే సీఎం రేవంత్‌రెడ్డి నేడు యూట్యూబర్స్‌ను క్రిమినల్స్ అని కించపరుస్తున్నారు.
మహిళా జర్నలిస్టుల అరెస్టు సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చ వేళ ఓ వైపు నీతులు చెప్తూనే మరోవైపు రేవంత్‌రెడ్డి జర్నలిస్టులను బట్టలిప్పదీసి కొడతానని చెప్పడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనం. మహిళలపై చర్చ జరుగుతున్న సోయి మరిచి రేవంత్‌రెడ్డి మాట్లాడగా.. అతని సోదరుడు గతంలోనే తన రౌడీ మూకలతో ద్రౌపది వస్ర్తాపహరణాన్ని చేసి చూపించారు. అసెంబ్లీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి నీతులు చెప్తున్నారు. రెండు రోజుల ముందే కొత్తగా నియామకాలు అందుకున్న ఉద్యోగుల ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను మరిచిపోయినట్టున్నారు. అంతకుముందు స్కూల్ పిల్లల ఎదుట కూడా సుభాషితాలు పలికారు. నీతులు వల్లించే ముందు రేవంత్‌రెడ్డి తాను నీతిగా ఉండాలి. ఇతరులకు సుద్ధులు చెప్పే ముందు ఆయన బుద్ధి తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే నాకైతే గురువింద గింజనే గుర్తుకు వస్తున్నది.