జనగణనకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళలకు చట్టసభల్లో మూడవ వంతు స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను 848కి పెంచుతారా? లేక కేంద్రం చెప్తున్నట్టు 888కి పెంచుతారా? అనే అంశం తెలియాల్సి ఉంది. ఏతావాతా మహిళా రిజర్వేషన్లు, పునర్విభజన అమలయ్యే అవకాశం ఉంది. కానీ, లోక్‌సభ సీట్ల పెంపు మాత్రం రాజ్యాంగ సవరణ చేస్తేనే తప్ప సాధ్యపడదు. జనగణన తర్వాత జరిగే పునర్విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల అసెంబ్లీ స్థానాల సంఖ్య వరుసగా 175 నుంచి 225, 119 నుంచి 153కి పెరిగే అవకాశం ఉండటం గమనార్హం.
128వ రాజ్యాంగ సవరణ చట్టం (106వ రాజ్యాంగ సవరణ) అమల్లోకి వచ్చిన 2023 సెప్టెంబర్ 19వ తేదీ తర్వాత జరిగే తొలి జనగణన లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి, మహిళలకు రొటేషన్ పద్ధతిలో మూడో వంతు సీట్లను 3 పర్యాయాలు కేటాయించాలని పార్లమెంట్ నిర్దేశించింది. దీనివల్ల 2026 తర్వాత జరిగే జనగణనతో పునర్విభజన అనే నిబంధన తొలగిపోతుంది. చివరిదైన పార్లమెంటు స్థానాల పెంపునకు 84వ అధికరణాన్ని సవరించడం ద్వారా 82వ అధికరణానికి ఉన్న అడ్డంకిని అధిగమించవచ్చు.
2026 తర్వాత జరిగే తొలి జనగణన ప్రకారం పునర్విభజన చేయాలని 84వ అధికరణం చెబుతున్నది. అయినప్పటికీ, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్థానాలను 83 నుంచి 90కి పెంచి ఎన్నికలు నిర్వహించారు. 370వ అధికరణం రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఏమీ లేదు. ఆర్టికల్ 3, 4 ప్రకారం జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించారు. ఆ చట్టంలో 2026 జనగణన తర్వాత అనే అంశానికి బదులుగా 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేయాలని పేర్కొన్నారు. అందువల్లనే అక్కడ సాధ్యపడింది. మహిళా బిల్లు కూడా 2026 తర్వాత జరిగే జనగణన స్థానంలో 84వ అధికరణానికి బదులుగా 128వ రాజ్యాంగ సవరణ తర్వాత జరిగే జనగణన ద్వారా పునర్విభజన జరపాలని ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.
2024, 2025లో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్పీఆర్) పూర్తి చేసుకుని, 2026 జనవరిలో జనగణన వివరాలు డిజిటల్ విధానంలో ట్యాబ్‌ల ద్వారా సేకరిస్తారు కాబట్టి త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. 2026 జనవరి నాటికి జనగణన పీసీఏ (ప్రైమరీ సెన్సస్ అబ్స్ట్రాక్ట్)ను ప్రకటించవచ్చు. ఇది పునర్విభజనకు సరిపోతుంది. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ స్థానాలను పెంచుతారా? లేక మరో 20 ఏండ్లు నిషేధం పొడిగిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుత లోక్‌సభ స్థానాల ప్రకారం పునర్విభజన చేస్తే ఉత్తరాదిలో భారీగా సీట్లు పెరిగి, దక్షిణాదికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. అలాకాకుండా మొత్తం సీట్లను 848 లేదా 888కి పెంచుతారా? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఈ అంశంపై బీజేపీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లే దు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎన్డీ యే పక్షాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఒకవేళ పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచే అవకాశం లేకపోయినా, 2026లో జనగణన పూర్తయితే పునర్విభజన జరిపి మహిళలకు 3వ వంతు సీట్లు కేటాయించవచ్చు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ర్టాల అసెంబ్లీ సీట్ల పెంపునకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఒక వ్యక్తి -ఒక ఓటు -ఒక విలువ అన్న ప్రజాస్వామిక, రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునఃకేటాయింపు, పునర్విభజన జరిగితే దక్షిణ, ఉత్తర భారత్‌ల మధ్య విద్వేషం పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాల్లో జనాభా పెరుగుదల నిష్పత్తిలో గణనీయమైన మార్పులు న్నాయి. టోటల్ ఫెర్టిలిటి రేట్ (దేశ సగటు) 1971లో 5.2, 1981లో 4.5, 1991లో 3.6, 2001లో 3.1, 2011లో 2.4గా నమోదైంది. అయితే, ఉత్తరాది రాష్ర్టాలు, పశ్చిమ బెంగాల్లో జనాభా గణనీయంగా పెరగగా దక్షిణాది రాష్ర్టాలతో పాటు కొన్ని చిన్న రాష్ర్టాల్లో దేశ సగటు కంటే చాలా తక్కువగా జనాభా పెరుగుదల నమోదైంది.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలో అత్యధిక జనా భా ఉన్న దేశంగా అవతరించింది. ప్రస్తుతం భారత జనాభా 140 కోట్లకు పైగా ఉన్నట్టు ఓ అంచనా. మన దేశంలో జనాభా నియంత్రణకు 1950వ దశకం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ర్టాలు జనాభాను విజయవంతంగా నియంత్రించాయి. ఉత్తరాది రాష్ర్టాలు మాత్రం ఈ విషయంలో పూర్తిగా విఫల మయ్యాయి. అయితే, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ర్టాలు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది.
2023 అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఒక పార్లమెంట్‌కు సగటున 23 లక్షల మంది జనాభా ఉండగా.. బీహార్‌లో 31 లక్షలు, పశ్చిమబెంగాల్లో 23 లక్షలు, రాజస్థాన్‌లో 32 లక్షలు, ఏపీలో 21 లక్షలు, తెలంగాణలో 22 లక్షలు, మేఘాలయలో 16 లక్షలు, చండీగఢ్ర్లో 12 లక్షలు, హిమాచల్‌ప్రదేశ్‌లో 18 లక్షల మంది జనాభా ఉన్నారు. మొదటి మూడు పునర్విభజనలను జనాభా ప్రాతిపదికన చేసినప్పటికీ పైన పేర్కొన్న విధంగా దేశంలో జనాభా పెరుగుదల, తగ్గుదల విషయంలో వివిధ రాష్ర్టాలలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. లోక్‌సభ స్థానాలను 888కి పెంచితే 2026 జనాభా లెక్కల అంచనా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 143, బీహార్‌లో 79, పశ్చిమబెంగాల్లో 60, మహారాష్ట్రలో 76, ఉభయ తెలుగు రాష్ర్టాల్లో 54, తమిళనాడులో 49, రాజస్థాన్‌లో 50, గుజరాత్లో 43 పార్లమెంట్ స్థానాలుంటాయి. అంటే ఈ కేటాయింపుల వల్ల దక్షిణాదిలో మొత్తంగా సీట్ల సంఖ్య 130 నుంచి 165కు పెరిగినప్పటికీ ఇప్పుడున్న లోక్‌సభలో 23.19 శాతంగా ఉన్న ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుంది. ఇది ఆందోళనకరమైన పరిణామం.
ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను మార్చకుండా 2025లో కొత్త జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిపి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే దక్షిణాది రాష్ర్టాలు నష్టపోతాయి. తెలంగాణ 3, ఏపీ 5, కర్ణాటక 2, తమిళనాడు 8, కేరళ 8 స్థానాలను కోల్పోతాయి. పశ్చిమబెంగాల్ 4, ఒరిస్సా 3, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఒక్కో సీటు చొప్పున నష్టపోతాయి. ఇక పెరిగే సీట్లన్ని హిందీ రాష్ర్టాల్లోనే. ఉత్తరప్రదేశ్‌లో 11, బీహార్‌లో 10, రాజస్థాన్‌లో 6, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ఒకటి చొప్పున సీట్లు పెరుగుతాయి. ఈ పునర్విభజన వలన వచ్చే దుష్పరిణామాల నివారణకు మరోసారి రాజ్యాం గ సవరణ చేయడం సముచితం.
దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాల సంఖ్యకు అదనంగా 33 శాతం పెంచితే బాగుంటుంది. అంటే ఈ లెక్కన ఉత్తరప్రదేశ్‌లో 27 స్థానాలు పెరుగుతుండగా, తమిళనాడులో 13, ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 5 స్థానాల చొప్పున పెరుగుతాయి. ఈ ఫార్ములా ప్రకారం అన్ని రాష్ర్టాల్లో సీట్ల సంఖ్య పెరుగుతాయి. ఇప్పుడున్న జనాభా, పార్లమెంట్ స్థానాల నిష్పత్తి కూడా అలాగే కొనసాగుతుంది.
హిందీ బెల్టులో పెరిగే సీట్ల వల్ల లబ్ధి పొంది అధికారాన్ని ఎన్నటికీ తమ చేతిలో ఉంచుకోవాలన్న బీజేపీ ఆలోచనలు మారకుంటే విపత్కర పరిణామాలు సంభవిస్తాయి. ఉత్తరాది వారు తమకు ద్రోహం చేస్తున్నారని దక్షిణాది రాష్ర్టాలప్రజలు భావించే అవకాశం ఉంది. అంతేకాదు, దీనివల్ల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుం ది. అదే జరిగితే దేశ విభజన దిశగా ఆలోచనలు పురుడు పోసుకునే అవకాశమూ లేకపోలేదు.
-(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– ఇనగంటి రవికుమార్ 94400 53047