కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్మాణాత్మకమైన చర్చ జరగడం లేదు. రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పక్కనపెట్టి రాజకీయ కోణంలో మాట్లాడటం సరికాదు. ఒక పల్లెటూరిలోని బోరు మోటారు చెడిపోతేనే ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటుచేసి ప్రజల అవసరాలను తీరుస్తాం. అటువంటిది ఒక పెద్ద ప్రాజెక్టులోని మూడు పిల్లర్లు కుంగిపోతే వాటికి మరమ్మతులు చేయకుండా, దానిని వినియోగంలోకి తీసుకురాకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండటం హేయనీయం. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా చర్చలు, మాటలు, విమర్శలు చేయడం ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒంటికాలుపై లేచేవాళ్లకు తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తెలువదనుకోవడానికి లేదు. ఉవ్వెత్తున లేచిన తెలం గాణ ఉద్యమంలో ప్రజల వెంట నడిచినవాళ్లంతా ఇవాళ ప్రాజెక్టులపై విపరీతమైన అభ్యంతరాలు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడే అనేక రకాలుగా ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారు. దీనివెనుక ఆంధ్ర ప్రేరేపిత మీడి యా, మేధావులు, అనుయాయులున్నారని అప్పుడే తేలిపోయింది. అప్పుడు వాళ్లు లేవనెత్తిన అభ్యంతరాలు ఒకటి పర్యావరణ విధ్వంసం, రెండవది భూ సేకరణ, చివరగా కరెంటు వినియోగ ఖర్చులు. వీటన్నింటి దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు సరైనది కాదనే దుష్ప్రచారం అప్పటినుంచి ఇప్పటివరకు చెలామణిలో ఉన్నది. అయితే, స్వల్పంగా పర్యావరణానికి నష్టం కలిగినా, దీర్ఘకాలికంగా పర్యావరణ సమస్యారహిత, జనహిత ప్రాజెక్టుగా ఇది మిగిలిపోతుందనేది వాస్తవం. నదీగర్భంలో నిల్వ ఉండే నీటి వల్ల, రిజర్వాయర్ల వల్ల కొత్త నీటి పర్యావరణ వ్యవస్థ లు ఉద్భవించాయి. భూ సేకరణ సమస్యను దాటి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ అడ్డంకిని దాటుకొని ప్రాజెక్టు పూర్తికావడంతో మూడో విమర్శను సీరియస్ గా ఎక్కు పెట్టినారు. ప్రాజెక్టు నిర్వహణకు విద్యుత్తు వినియోగం అనేది చాలా పెద్ద సమస్యగా చిత్రీకరించారు. అది ఒకింత ప్రజలు, సామాన్యులు నమ్మే పరిస్థితి వచ్చింది. గత పాలకులు ఆ సమస్యను ఎలా అధిగమిస్తామో ప్రజలకు అర్థమయ్యేవిధంగా చెప్పలేకపోవడంతో ఇప్పటికీ అది ఒక బేతాళ ప్రశ్నగా చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకులు కాలం గడుపుతున్నా రు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ సోయితో పరిశీలిస్తే అబద్ధాల మబ్బు తెరలు వీడి మనకు వాస్తవాలు కనబడుతాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలను గనుక పరిశీలిస్తే.. దేవాదుల ఎత్తిపోతల నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలు, అది ఎన్నడూ పూర్తిస్థాయిలో వినియోగించబడలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి వారుప్రతిపాదించిన నిల్వ సామ ర్థ్యం 5 టీఎంసీలు అయితే వారు నిర్మించిన ట్యాం కుల సామర్థ్యం 2 టీఎంసీలు కూడా లేదు. ప్రాణహిత చేవెళ్లకు వాళ్లు ప్రతిపాదించిన నీటి నిల్వ సామర్థ్యం సుమారు 16 టీఎంసీలు మాత్రమే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 145పై చిలుకు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 16 టీఎంసీల సామర్థ్యం లేని రిజర్వాయర్లలో 145 టీఎంసీల నీటిని ఎలా నిల్వ చేస్తారని కేం ద్ర జలవనరుల సంఘం అభ్యంతరం చెప్పింది. ఇదే విషయాన్ని మన తెలంగాణ ప్రాంత ఇంజినీర్లు ప్రశ్ని స్తే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు. నిల్వసామ ర్థ్యం లేని ఎత్తిపోతల ప్రాజెక్టుల నుంచి స్థిరంగా 140 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బహుళ దశలలో నిర్మించబడిన ఈ ప్రాజెక్టుపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ గొంతుకలు ఇవాళ తెలంగాణ ప్రజల ప్రాజెక్టులపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణకు ఎత్తిపోతల తప్ప మరో పద్ధతిలో నీటిని తీసుకునే అవకాశం లేనప్పుడు, కాళేశ్వరానికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించే శక్తి ఈ విమర్శకులకు ఉన్నదా? ప్రజల ముందు ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధి నమూనాను ఏమైనా పెట్టగలిగారా? అంటే అదీ లేదు. మరి కట్టిన ప్రాజెక్టుపై విష, దుష్ప్రచారాల వెనుక ఉన్నదెవరు? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాకుండా ఎవరి ప్రయోజనాల కోసం ఈ గొంతుకలు మాట్లాడుతున్నాయి. ఒకవేళ కాళేశ్వ రం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అవినీతిపై విచారణ జరపాలి. దానికి బదులుగా అవినీతి జరిగిందని ప్రచారాన్ని ప్రజల్లోకి వదిలి, ప్రాజెక్టు నిర్వహణ గాలిలో వదిలేసి, తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెడతామంటే అది ఏ రకమైన నీతి?
కాళేశ్వరం వినియోగంలోకి వచ్చిన తర్వాత పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులతో గ్రామీణ ఆర్థికవ్యవస్థ గాడిన పడింది. సాపేక్షంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లడంలో వ్యవసాయ రంగంలోని అభివృద్ధి ముఖ్య పాత్ర పోషించింది. పెరిగిన భూగర్భ జలాల వల్ల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పాయి. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ దెబ్బతిన్న తర్వాత నీటి పంపిం గ్ పూర్తిగా ఆగిపోయింది. దాని ప్రభావం తర్వాత సీజన్ వ్యవసాయరంగంపై తీవ్రంగా పడింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్కు మేం విజ్ఞప్తి చేశాం. సాధ్యమైనంత త్వరగా రిపేర్లు అయినా పూర్తిచేయండి. అది కుదరకుంటే మంచిగా ఉన్న బ్లాక్ దగ్గర పాక్షికంగా నీటిని ఆపి ఎత్తిపోయమని విన్నపం చేశాం. అక్కడ ఎటువంటి ప్రయత్నం చేయకుండానే డ్యామ్ సేఫ్టీ అథారిటీకి విచారణ చేయమని అప్పగించడం ద్వారా రెండో సీజన్ కూడా నీటిని తీసుకోకుండానే వృథాగా పోయింది. ఇప్పుడు వాళ్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా మూడు బ్యారేజీలకు భూగర్భ సర్వే నిర్వహించి రిపోర్టు తయారుచేయడానికి మరో రెం డేండ్లు పడుతుంది. అంటే రాబోయే రెండేండ్లు కూడా తెలంగాణ రైతులకు గోదావరి నీళ్లివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని అర్థమవుతున్నది. మరోవైపు ఏపీలో పోలవరం పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. బనకచర్ల ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా ముందుకువెళ్తున్నాయి.
ప్రజల జీవన ప్రమాణాలతో ఆటలాడుకునే హక్కు ఎవరికీ, ఏ ప్రభుత్వానికి లేదు. ప్రజలు ప్రభుత్వాలను మార్చేది గతంలో కంటే మెరుగైన పాలన కోసమే. అందుకు భిన్నంగా వారి జీవన ప్రమాణాలను దిగజార్చితే, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై విలోమ ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారా? దూషిస్తారా? ఆలోచించుకోండి. రాజకీయాలను అధికార మార్పిడికే వాడుకుంటే అర్థం చేసుకోవచ్చు. రాజకీయా ల కోసం ప్రజల కనీస అవసరాలను నిర్లక్ష్యం చేస్తే అది ప్రజాహిత పాలన అనిపించుకోదు.