‘కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే, అక్కడ అన్నీ కుంభకోణాలే. ఇంతకుముందు వందల కోట్ల కుంభకోణాలుండేవి, ఇప్పుడవి లక్షల కోట్లకు చేరాయి. ఇదీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సాధించిన ఘనత. మహారాష్ట్రలో ఆదర్శ్ కుంభకోణం, ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్సార్ హయాంలో అవినీతి, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఢిల్లీలో సీఎం షీలా దీక్షిత్ స్కాములు. అదేవిధంగా సోనియాగాంధీ, రాబర్ట్ వాద్రా ప్రమేయంతో 2జీ స్కాం, కామన్వెల్త్ గేమ్స్ స్కాం, బొగ్గు కుంభకోణం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న ముఖ్యనేత. విపక్షంలో ఉన్నపుడు టీవీ చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, చరిత్ర చెప్పిన అక్షర సత్యాలు.
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష్కారం అనే మాట కాంగ్రెస్ వాళ్లకు ఏనాడూ పట్టదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందుకే కాంగ్రెస్‌ను ఏ కోణంలో చూసినా కుంభకోణమే కనిపిస్తది అంటుంటారు విపక్ష నాయకులు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్లు అవినీతి గురించి మాట్లాడటం అంటే.. పులి శాకాహారం గురించి మాట్లాడినట్టే ఉంటది మరి. అవినీతిని ఒక కళగా పెంచి పోషించి, వ్యవస్థీకృతం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు నిత్యం స్వప్రయోజనాల కోసం పోట్లాడుకోవడమే తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడటమనేది వారి చరిత్రలోనే లేదు.
స్కాంలకు పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ అన్న అపకీర్తిని మూటగట్టుకున్నది. అవినీతికి మారుపేరుగా మారిన ఆ పార్టీని స్కాంగ్రెస్‌గా అభివర్ణిస్తుంటారు. అలాంటి స్కాంగ్రెస్‌ను 206 ఎంపీ సీట్ల నుంచి 44 సీట్లకు దించారు దేశ ప్రజలు. పార్టీకి నాయకత్వం వహించలేక చేతులెత్తేసిన జాతీయనేత రాహుల్‌గాంధీ రూ.80 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఖమ్మం సభలో ఆరోపించడం విడ్డూరం.
కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులన్నీ మరిచిపోయి, గురివింద గింజ మాదిరిగా.. సీఎం కేసీఆర్ పక్కన అందరూ కోటీశ్వరులే ఉన్నారని నోరుపారేసుకున్నారు రాహుల్‌గాంధీ. మరి తన పక్కనున్నది కూడా బడా కాంట్రాక్టర్లు, కోటీశ్వరులన్న సంగతి తెలియనట్టే నటించాడు రాహుల్. తెలంగాణలో పోడు చేసుకుంటున్న గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలను అందించే ప్రక్రియను సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రారంభించారు. ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇదేమీ తెలియని రాహుల్‌గాంధీ గిరిజనులకు పో డు పట్టాలిస్తామని కొత్తగా ప్రకటించడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం గాక మరేమిటి?
ఇంద్రవెల్లిలో పోలీసులతో కాల్పులు జరిపించి అమాయక ఆదివాసీ గిరిజనులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. నాలుగు దశాబ్దాలు దాటినా ఆ రక్తచరిత్రను ప్రజలింకా మరిచిపోలేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇంద్రవెల్లిలో పోలీసుల కాల్పుల్లో 100 మందికిపైగా చనిపోయినట్టు పౌరహక్కుల సంఘం తేల్చగా, మరో 250 మందికిపైగా చనిపోయినట్టు మరో సంఘం చెప్పింది. ఇట్లా 350 మంది ఆదివాసీలను పిట్టల్లా కాల్చిన కాంగ్రెస్ నేడు గోముఖ వ్యాఘ్రంలా మా ట్లాడుతున్నది. ఖమ్మం జిల్లాలో ఇండ్ల స్థలాలివ్వాలని ప్రదర్శన జరుపుతున్న ముదిగొండ ప్రజలపై కాల్పులు జరిపి నిరుపేద ప్రజలను నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పు డు తాము అధికారంలోకి వచ్చాక పేదలను ఉద్ధరిస్తామని చెప్తే నమ్మడానికి.. తెలంగాణలో అమాయకులెవరూ లేరని గుర్తెరగాలి.
తెలంగాణ కోసం సుదీర్ఘకాలం ఉద్యమించడమేకాదు, ఆ ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పార్టీ.
సమైక్య పాలనలో దశాబ్దాల కాలం అన్నిరంగాల్లో విధ్వంసానికి గురైంది తెలంగాణ ప్రాంతం. కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత, తెలంగాణ పునర్నిర్మాణం కోసం తొమ్మిదేండ్లుగా నిరంతరం కృషిచేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో వారెన్నో గడ్డు సమస్యలను ఎదుర్కోవడమే కాదు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొన్నారు.
రాష్ట్రంలోని అన్ని కులాలకూ, అన్ని మతాలకూ మేలు చూస్తూ, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో పల్లెలు, పట్టణాలు, నగరాల న్నీ అభివృద్ధి చెందాయి. ఈ రోజు తెలంగాణలో హనుమంతుని గుడిలేని ఊరు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. బీఆర్ఎస్సే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామ రక్ష. రేపు మళ్లీ వచ్చేది కూడా మా నవతకు మారుపేరైన కేసీఆర్ సారే. పేద ప్రజలపై మనసుగల్ల బీఆర్ఎ స్ సర్కారే.. అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-పీ.ఎల్.శ్రీనివాస్
73374 01177