“నీళ్లు, నిధులు, నియామకాలు” తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానంగా వినవచ్చిన మాటలు. ప్రజలమంతా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించాం. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లయినా నిరుద్యోగుల పరిస్థితి మారలేదు. నియామకాల పరిస్థితి మెరుగు కాలేదు. గడిచిన 25 నెలల్లో ఏడాదికి ఒకటి చొప్పున యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు జాబ్ క్యాలెండర్లు ప్రకటించి క్రమం తప్పకుండా నియామకాల పరీక్షలు జరుపుతూ ఉద్యోగాలు ఇస్తోంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 2024లో ఏ వివరాలు లేని క్యాలెండర్‌ను మొక్కుబడిగా ప్రకటించింది. అందులో కొలువుల భర్తీ జాడ లేదు. మరో ఏడాది గడిచినా మరో క్యాలెండర్‌కు అతీగతీ లేని పరిస్థితి ఉంది.
2025లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా నిరుద్యోగిత ఉన్నట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తెలిపింది. ప్రధానంగా యువతలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఉపాధి, ఉద్యోగాలు లేక పెద్ద నగరాలు, పట్టణాల్లో యువత జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల్లో గిగ్ వర్కర్లుగా పనిచేసే పరిస్థితి ఏర్పడింది.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఏటా జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తి చేస్తామని “అభయహస్తం-ఎన్నికల ప్రణాళిక“ ద్వారా కాంగ్రెస్ వాగ్దానం చేసింది. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “యూత్ డిక్లరేషన్“ పేరుతో ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ ఆపదమొక్కులు మొక్కారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. రెండు లక్షల ఉద్యోగాలు అన్నచోట కేవలం 11,600 ఉద్యోగాలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించి ఆ ఉద్యోగాలన్నీ తమ ఖాతాలో జమ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పలుకుతోంది. మొదటి ఏడాదిలో ప్రకటించిన 1,90,000 ఉద్యోగాల క్యాలెండర్ జాడలేదు. మంత్రులు 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ అని ప్రకటిస్తారు. కానీ జాబులు లేవు, క్యాలెండర్ లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తే మంత్రి శ్రీధర్‌బాబు అందరికీ ఉద్యోగాలు ఎలా ఇస్తామని వ్యంగ్యంగా నిందలు వేస్తారు.
అబద్ధాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలోనూ, నోటిఫికేషన్లు విడుదల చేయడంలోనూ, అందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలోనూ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రస్తుతం రాష్ట్రంలో 7.2% నిరుద్యోగిత ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ నివేదిక చెబుతోంది.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతబడిన నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దూరమయ్యాయి. పట్టభద్రులు తమ డిగ్రీలను పక్కకు పెట్టి క్లర్కులు, మిషన్ ఆపరేటర్ల వంటి ఉద్యోగాల్లో చేరుతున్నట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం వల్ల తక్కువ వేతనాలకు యువత పనిచేస్తున్నారు. విపరీతంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇదిలా ఉంటే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో 4,93,820 మంది ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పేరుతో నియామకాలు చేసే 900 ఏజెన్సీలు చూపిస్తున్న సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు సుమారు 25 వేల వరకు తేడా ఉంది. అంటే 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వీరందరికీ చెల్లించే వేతనాలన్నీ ఏజెన్సీలకు ఆదాయ వనరుగా మారింది. ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తోంది. నకిలీ ఉద్యోగాలతో పాటు, తక్కువ వేతనాలు ఇచ్చే కాంట్రాక్టు ఉద్యోగాల వైపు పోకుండా ప్రభుత్వ నియామకాల కోసం కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలలో నెలల తరబడి పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఆగ్రహంతో ఉన్నారు. చివరకు ఓపిక నశించి వారు రోడ్డు పైకి వచ్చి నిరసనలు చేస్తే వారికి లాఠీచార్జీలు, కేసులు ఎదురవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. దీని ద్వారా విద్యావంతులైన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్‌ను రూపొందించి రెగ్యులర్‌గా ప్రభుత్వ ఉద్యోగాలను నియామకాలు చేసే విధానం రూపొందించాలి. ఈ విజన్ డాక్యుమెంట్ ఆచరణాత్మకంగా ఉంటేనే రాష్ర్టానికి ఉపయోగపడుతుంది. నిరుద్యోగులకు మేలు కలుగుతుంది. అందులో చెప్పే లక్ష్యాలకు, వనరులకు మధ్య తేడా ఉన్నప్పుడు ఆచరణాత్మకంగా ఉండే అవకాశం లేదు. విజన్ డాక్యుమెంట్ ఆధారంగా జరిగే అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధిగా ఉండాలి. ప్రజల భాగస్వామ్యం లేకుండా కేవలం కార్పొరేట్లకే అవకాశం కల్పిస్తే అభివృద్ధికి, ప్రజలకు మధ్య దూరం పెరుగుతుంది. నిరుద్యోగం తీరదు. ఉపాధి పెరగడంతో పాటు ఉత్పత్తిలో ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రానున్న కాలంలో ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యత లభించాలి. అభివృద్ధికి సుస్థిరత చేకూర్చేందుకు ఇప్పటికి కూడా ఉత్పత్తి రంగానికి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కొనసాగుతోంది. నిరుద్యోగ నిరూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నిరుద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని నివారించగలుగుతాం. యువత భాగస్వామ్యం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయగలుగుతాం.
(వ్యాసకర్త: విద్యా రంగ విశ్లేషకులు)
కె.వేణుగోపాల్
9866514577